
జాతీయ పోటీలకు కోచ్‌గా అర్జున్‌రావు రెడ్డి
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ బాస్కెట్‌బాల్ కోచ్ గాలి అర్జున్‌రావు రెడ్డి జాతీయ పోటీలకు కోచ్‌గా నియమితులయ్యారు. పంజాబ్‌లో సెప్టెంబర్ 2 నుంచి జరగనున్న 75వ ఆలిండియా జూనియర్స్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్–2025 పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ బాలికల జట్టుకు కోచ్‌గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు శాప్ నుంచి ఉత్తర్వులు అందుకున్నారు. ఈయన నియామకం పట్ల శ్రీకాకుళం జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ చైర్మన్ ఎమ్మెస్సార్ కృష్ణమూర్తి, డీఎస్‌డీఓ డాక్టర్ కె.శ్రీధర్‌రావు, కోచ్‌లు, సీనియర్ క్రీడాకారులు సంతోషం వ్యక్తం చేశారు.
7న సంపూర్ణ చంద్రగ్రహణం
అరసవల్లి: సెప్టెంబర్ 7వ తేదీన భాద్రపద శుద్ధ పౌర్ణమి ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ప్రసిద్ధ సూర్యక్షేత్రం అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయం మధ్యాహ్నం 2 గంటల నుంచి మూసివేస్తున్నట్లుగా ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, ఈఓ కెఎన్‌వీడీవీ ప్రసాద్‌లు తెలియజేశారు. ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం 7వ తేదీ రాత్రి వేళలో గ్రహణ సమయం కావడంతో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మద్యాహ్నం 12.30 గంటల వరకు సర్వదర్శనాలకు అవకాశమిచ్చి.. అనంతరం భోగసమయం దాటాక అంటే మధ్యాహ్నం 2 గంటలకే ఆలయ ప్రధాన ద్వారాలు మూసివేయనున్నామని వారు వివరించారు. గ్రహణానంతరం ఆలయంలో సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమాల అనంతరం మరుసటి రోజు అనగా 8వ తేదీ సోమవారం ఉదయం 7.30 గంటల నుంచి సర్వదర్శనాలకు అనుమతివ్వనున్నట్లుగా వారు శుక్రవారం ప్రకటించారు. భక్తులు గమనించి గ్రహణ నియమాలను పాటించాలని కోరారు.
అర్జీలు సత్వరం
పరిష్కరించాలి: ఎస్పీ
పలాస: పోలీసు స్టేషన్‌కు వచ్చిన అర్జీలను సత్వరమే పరష్కరించాలని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి చెప్పారు. కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌లో శుక్రవారం ప్రజా గ్రీవెన్స్‌లో పాల్గొన్నారు. పలువురి నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని టెక్కలి, కాశీబుగ్గ సబ్‌డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల కోసం కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌లో ప్రత్యేకంగా ప్రతి శుక్రవారం ఈ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. వీటిని ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. అర్జీలను స్వీకరించిన తర్వాత వాటిని స్వయంగా పరిశీలించారు. పెండింగ్ కేసులన్నీ తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటప్పారావు, సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

జాతీయ పోటీలకు కోచ్‌గా అర్జున్‌రావు రెడ్డి