
బస్సులు లేవు.. రైళ్లు రావు!
● ప్రయాణికులకు నరకయాతన
● ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వేస్టేషన్లలో గంటల తరబడి పడిగాపులు
శ్రీకాకుళం అర్బన్/కంచిలి: సరిపడా బస్సులు లేక, సకాలంలో రైళ్లు రాక జిల్లా ప్రయాణికులు శుక్రవారం నరకయాతన అనుభవించారు. విజయనగరం వద్ద గూడ్స్ రైలు ప్రమాదం జరగడంతో అటు విశాఖపట్నం నుంచి వచ్చే రైళ్లు, ఇటు భువనేశ్వర్ నుంచి వచ్చే రైళ్లు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌కు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇచ్ఛాపురం, సోంపేట, పలాస, ఆమదాలవలస తదితర అన్ని బస్‌స్టేషన్‌లతో పాటు జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం కాంప్లెక్స్ కూడా ప్రయాణికులతో రద్దీగా కనిపించింది. దీంతో ఉదయం 9గంటలకు ప్రారంభమైన రద్దీ సాయంత్రం వరకూ కొనసాగింది. వచ్చిన బస్సులు నిండిన వెంటనే వెళ్లిపోవడంతో మిగిలిన ప్రయాణికులు బస్సుల కోసం పడిగాపులు కాశారు. ముఖ్యంగా దూరప్రాంతమైన విశాఖపట్టణం వెళ్లేందుకు అవస్థలు పడ్డారు. మరోవైపు బరంపురం–విశాఖపట్నం, భువనేశ్వర్–విశాఖపట్నం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. సోంపేట రైల్వేస్టేషన్‌లో ఉదయం 8.26 గంటలకు వచ్చిన ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ 11.30 గంటల వరకు నిలిచిపోయింది. ఆ రైలు కదిలిన తర్వాత అదే ప్లాట్‌ఫాం మీదకు ఇక్కడ స్టాపేజీ లేని షాలిమర్–వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్ వచ్చింది. ఇది కూడా మధ్యాహ్నం 3 గంటల వరకు నిలిచిపోయింది. ఉదయం 9.20 గంటలకు రావల్సిన కోల్‌కత్తా– చైన్నె మెయిల్ మధ్యాహ్నం 3–50 గంటలకు వచ్చింది. ఇక భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్ ఉదయం 11.45కి రావల్సి ఉండగా.. సాయంత్రం 4.20 గంటలకు వచ్చిందని సోంపేట రైల్వేస్టేషన్ మేనేజర్ సత్యనారాయణ బెహరా తెలిపారు.