
ఆటో, మ్యాక్సీ డ్రైవర్లను ఆదుకోవాలి
రణస్థలం: ఉచిత బస్సు పథకం వల్ల ఉపాధి కోల్పోతున్న ఆటో, మ్యాక్సీ డ్రైవర్లకు భృతి ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని ఏఐటీయూ ఏపీ ఆటో, ట్యాక్సీ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జి.వామనమూర్తి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం రణస్థలం రామతీర్థం జంక్షన్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం ధర్నా నిర్వహించి తహసీల్దార్ సనపల కిరణ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు కిరాయి లేక తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. ఫైనాన్స్ కట్టలేక, అప్పులు తీర్చలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. డ్రైవర్లకు భారమైన థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్సీ, టోల్ ఫీజులు 30శాతానికి తగ్గించాలని డిమాండ్ చేశారు. విడి భాగాలపై జీఎస్టీ, వ్యాట్, సెస్ పన్నులు రద్దు చేసి డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. చంద్రబాబు ఆధికారంలోని వస్తే బ్యాడ్జీ కలిగిన డ్రైవర్లకు సంవత్సరానికి రూ. 15వేలు ఆర్ధిక సహాయం చేస్తామని, పీఎఫ్, ఈఎస్‌ఐతో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, అనారోగ్యంతో చనిపోతే రూ.5లక్షలు, ప్రమాదంలో చనిపోతే 10లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారని, వాటిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లైసెన్సు కలిగిన ప్రతి ఆటో డ్రైవర్‌కు ఏటా రూ.25వేలు ఆర్థిక సహాయం అందించాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు కె.శివ, సీఐటీయూ నాయకులు వెలమల రమణ, ఎస్.లక్ష్మణరావు, బి.రామకృష్ణ, బొంతు లక్ష్మణరావు, చిరంజీవి, ఎం.రాముడు, జగదీష్, జి.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.