సర్కారు వైఖరి.. మూడు బడులకు ఉరి
● ప్రభుత్వ విధానాలతో మూతపడిన మూడు పాఠశాలలు
● సొంత ఊరిలో విద్యకు నోచుకోని కౌశల్యాపురం, మహదేవిపురం, నేరడి గ్రామాల పిల్లలు
కొత్తూరు: కూటమి ప్రభుత్వ వైఖరి ప్రభుత్వ బడులకు ఉరిగా మారుతోంది. విద్యా శాఖలో ఈ ఏడాది తీసుకువచ్చిన నూతన విద్యావిధానం విద్యార్థులకు శాపంగా మారుతోంది. చిన్నారులు ఉన్న ఊరిలో పాఠశాలలో చదువుకునే భాగ్యానికి దూరమవుతున్నారు. 3, 4, 5 తరగతుల విద్యార్థులను మరో బడికి పంపించేయడంతో కొత్తూరు మండలంలోని కౌశల్యాపురం, మహదేవిపురం, నేరడి గ్రామాలకు చెందిన మూడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయి. ఈ ఏడాది ఈ పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా జాయిన్ కాకపోవడంతో టీచర్లను మరో పాఠశాలకు నియమించారు.
ఈ గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న 3, 4, 5 తరగతుల విద్యార్థులను సమీపంలో ఉన్న మోడల్ ప్రైమరీ పాఠశాలకు పంపించారు. దీంతో ఈ మూడు పాఠశాలల్లో రెండో తరగతి చదువుతున్న ఒక్కో విద్యార్థి మిగిలాడు. ఒక విద్యార్థి కోసం ఒక టీచర్ పని చేస్తున్న తరుణంలో ఎక్కువ మంది పిల్లలు లేరన్న కారణంతో ఉన్న పిల్లలను తల్లిదండ్రులు వేరే బడికి పంపించారు. దీంతో విద్యార్థులు లేక మూడు పాఠశాలలను మండల విద్యాశాఖ అధికారులు మూసివేశారు. ఊరిలోని బడిలో పిల్లలను చదివించలేకపోతున్నామని ఆయా గ్రామాల ప్రజలు బాధ పడుతున్నారు.
గ్రామాల్లో పిల్లలు లేరు
మూత పడిన మూడు పాఠశాలల గ్రామాల్లో బడి ఈడు పిల్లలు లేరు. దీంతో ఈ ఏడాది పాఠశాలల్లో విద్యార్థులు చేరకపోవడంతో బడులు మూతపడ్డాయి. రెండో తరగతిలో ఉన్న ఒక్క విద్యార్థిని తల్లిదండ్రులు ఇతర పాఠశాలకు తీసుకువెళ్లడంతో పాఠశాలలను తాత్కాలికంగా మూసివేశాం.
– ఎన్.శ్రీనివాసరావు ఎంఈఓ–2, కొత్తూరు మండలం
సౌకర్యాలు లేవు
మా గ్రామంలో ఉన్న పాఠశాలలో సౌకర్యాలు లేవు. మరుగుదొడ్లు సక్రమంగా పని చేయ డం లేదు. మా పిల్లాడు ఒక్కడు మాత్రమే స్కూల్‌లో ఉంటే మానసిక వికాసం సరిగా ఉండదు. అందుకే సమీపంలోని కురిగాం పాఠశాలలో చేర్పించాము.
– ఒట్టికొట్టు స్వాతి, విద్యార్థి తల్లి, మహదేవి పురం కొత్తూరు మండలం
ఐదు తరగతులు నిర్వహించాలి
ఒకటి నుంచి ఐదు తరగతులు ఒకే పాఠశాలలో నిర్వహించిప్పుడే పిల్లలంతా ఒకే పాఠశాల లో చదువుతారు. మూడు నుంచి ఐదు తరగతుల వరకు చదువుతున్న పిల్లలను మరో పాఠశాలలో చేర్పించడం వల్ల మిగతా వారు ఉండడం లేదు.
– గూనాపు రాజు, విద్యార్థి తల్లి, నేరడి, కొత్తూరు
సర్కారు వైఖరి.. మూడు బడులకు ఉరి
సర్కారు వైఖరి.. మూడు బడులకు ఉరి
సర్కారు వైఖరి.. మూడు బడులకు ఉరి
సర్కారు వైఖరి.. మూడు బడులకు ఉరి


