బతుకు తల్లకిందులు
● ఆటో బోల్తా పడి విద్యార్థి మృతి
ఎచ్చెర్ల:
అమ్మను ఆట పట్టిస్తూ సందడిగా గడిపే వయసది. అక్కతో హాయిగా కబుర్లు చెబుతూ ఆనందంగా ఉండే ప్రాయమది. కింద పడి దెబ్బ తగిలితేనే విలవిలలాడిపోయే శరరీమది. కానీ నడిరోడ్డుపై తిరగబడిన ఆటో.. ఆ పిల్లాడి బతుకును తల్లకిందులు చేసేసింది. ఆ తల్లికి కొడుకును దూరం చేసింది. తమ్ముడి యాతనను కళ్లారా చూసిన అక్కకు జీవితానికి సరిపడా వేదన మిగిల్చింది. దాదాపు పది మంది ప్రయాణికులు ఉన్న ఆటోలో అంతా సురక్షితంగా బయటపడితే.. అతడు మాత్రమే చావుకు బలయ్యాడు. చిల కపాలెం జంక్షన్ సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో చిలకపాలెం గ్రామానికి చెందిన కుప్పిలి మనోజ్ (12) అనే విద్యార్థి మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
మనోజ్‌తో పాటు మరో ఆరుగురు విద్యార్థులు, ఇద్దరు టీచర్లు అల్లినగరం గ్రామంలోని ఉన్నత పాఠశాలకు ఆటోలో వస్తుండగా చిలకపాలెం జంక్షన్ దాటాక హైవేపై బండి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది.
ప్రమాదంలో మనోజ్ ఆటో కింద ఉండిపోవడంతో బలమైన గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు స్పందించి అతడిని శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ వైద్యులు మనోజ్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మనోజ్‌తో పాటుగా ఆటోలో ఉన్న విద్యార్థులు, టీచర్లు చిన్న గాయాలతో బయటపడ్డారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని రిమ్స్‌కు తీసుకెళ్లారు.
అక్క కళ్లెదుటే..
మనోజ్ అక్క దర్శినీ ప్రియ కూడా అదే ఆటోలో ఉంది. తమ్ముడి వేదనను కళ్లారా చూసిన ఆమె ఏం చేయాలో తెలీక నిస్సహాయంగా దిక్కుతోచని స్థితిలో ఏడుస్తుంటే చూసిన వారి కళ్లు చెమ్మగిల్లా యి. మనోజ్ తండ్రి కుప్పిలి ప్రకాష్ చిలకపాలెంలోని మునిపేట వద్ద కార్పెంటరీ పనిచేస్తూ జీవ నం సాగిస్తున్నాడు. ఇద్దరు పిల్లలు రోజూ ఆటోలోనే స్కూల్‌కు వెళ్లేవారు. ఇప్పుడు ఆ ప్రయాణమే మనోజ్ ప్రాణం తీయడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. మనోజ్ అల్లినగరం ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. అక్క 8వ తరగతి చదువుతోంది. విద్యార్థి మృతి చెందడంతో శుక్రవారం బడికి సెల వు ప్రకటించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పార్ధసారధి, ఉపాధ్యాయులు, విద్యార్థులు మనోజ్‌కు నివాళులర్పించారు. ఘటన జరిగిన చోట రద్దీగా ఉంటుందని, ఓ కానిస్టేబుల్‌ను పెట్టాలని యూటీఎఫ్ నాయకులు ఎస్‌ఐ సందీప్‌ను కోరగా ఆయన అంగీకరించారు.
బతుకు తల్లకిందులు
బతుకు తల్లకిందులు


