సిక్కోలులో బార్బరిక్ యూనిట్ సందడి
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళంలోని కిన్నెర థియేటర్‌లో ప్రదర్శిస్తున్న ‘బార్బరిక్’ చిత్ర యూనిట్ శుక్రవారం శ్రీకాకుళంలో పర్యటించింది. చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన సీనియర్ నటుడు సత్యరాజ్(కట్టప్ప)తో పాటు చిత్ర నటులు సత్యం రాజేష్ తదితరులు విచ్చేసి ప్రేక్షకులతో ముచ్చటించారు. చిత్ర దర్శకులు మోహన్ శ్రీవత్స మాట్లాడుతూ తనది శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం సుసరాం గ్రామమని, చిన్నప్పటి నుంచి తనకు సినిమాలంటే ఎంతో ఇష్టమని, ఆ ఇష్టంతోనే దర్శకునిగా మారి బార్బరిక్ చిత్రాన్ని తీశానని తెలిపాడు. సత్యరాజ్(కట్టప్ప) మాట్లాడుతూ శ్రీకాకు ళం రావడం ఇదే తొలిసారని, ఇక్కడి ప్రేక్షకులు ఎంతో మంచివారని, సినిమా బాగుంటే ఎంతగానో ఆదరిస్తారన్నారు. నటుడు సత్యం రాజేష్ మాట్లాడుతూ ‘ఊర్లో అందరూ మంచిగున్నార్రా’ అంటూ ప్రేక్షకులను అడిగేసరికి ప్రేక్షకులంతా కేరింతలు, ఈలలు వేశారు. ఇక్కడి ప్రేక్షకుల ఆదరాభిమానాలు మరువలేనివన్నారు. కార్యక్రమంలో చిత్ర యూనిట్ ప్రతినిధులు సురేష్, కిన్నెర థియేటర్ మేనేజర్ వరప్రసాద్, అసిస్టెంట్ మేనేజర్ జయరాం, డిస్ట్రిబ్యూటర్ తేజ తదితరులు ఉన్నారు.


