
తస్మాత్ జాగ్రత్త..!
● వినాయక
మండపాల్లో
జాగ్రత్తలు
తప్పనిసరి
● వర్షాల నేపథ్యంలో విద్యుత్ షాక్‌లకు అవకాశం
అరసవల్లి: వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలకు మండపాలు ముస్తాబయ్యాయి. సీరియల్ సెట్లు, ఎల్‌ఈడీ లైట్ల వెలుగులతో మండపాలు ధగధగలాడుతున్నాయి. అయితే ప్రస్తుతం వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఏమాత్రం ఆదమర్చినా ప్రాణాపాయం తప్పదని హెచ్చరిస్తున్నారు.
● వర్షాలు కురుస్తున్న క్రమంలో విద్యుత్ పరికరాలు తడవకుండా జాగ్రత్తలు వహించాలి. తడి చేతులతో విద్యుత్ పరికరాలను తాకకూడదు.
● విద్యుత్ లైసెన్స్ ఉన్న ఎలక్ట్రీషియన్లతోనే అలంకరణ పనులు చేయించాలి.
● మండపాలను విద్యుత్ స్తంభాలకు, ట్రాన్స్‌ఫార్మర్లకు కనీసం 3 మీటర్ల దూరంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
● విద్యుత్ పరికరాలకు సరైన ఎర్తింగ్ ఉండాలి. ఐఎస్‌ఐ ప్రమాణాలున్న నాణ్యమైన విద్యుత్ వైర్లు వాడాలి.
● డెకరేషన్ల విషయంలో సీరియల్ సెట్లు గోడ లకు, లోహ వస్తువులకు తగలకుండా అమర్చాలి. ఎల్‌ఈడీ బల్బులు వాడటంతో తక్కువ విద్యుత్ వినియోగమవుతుంది.
● పరిసరాలన్నీ పొడిగా ఉండేలా చర్యలు చేపట్టాలి. అత్యవసరాలకు సమీపంలోని సచివాలయా ల ఎనర్జీ అసిస్టెంట్లు, విద్యుత్ శాఖ ఏఈలను సంప్రదించాలి.
అందని ‘ఉచిత’ ఉత్తర్వులు..
జిల్లాలో వినాయక మండపాల్లో నవరాత్రుల్లో వినియోగించిన విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే భరిస్తుందని, మండపాలకు ఉచిత విద్యుత్ అందించే చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థకు ఎలాంటి లిఖితపూర్వక ఉత్తర్వులు జారీ కాలేదు. విద్యుత్ శాఖ మాత్రం ప్రభుత్వ ప్రకటన ప్రకారం జిల్లా అధికారుల బృందం (పంచాయతీ/మున్సిపాల్టీ, విద్యుత్, పోలీస్ తదితర శాఖలు) అనుమతి ఉన్న వినాయక మండపాల్లో ప్రత్యేక మీటర్లు అమర్చి రీడింగ్‌ను తీయించుకునేలా చర్యలు చేపట్టింది. ఉచితమనే విధానంపై స్పష్టత వస్తే ఎలాంటి బిల్లులు లేకుండా మండపాలకు విద్యుత్ వినియోగానికి వెసులుబాటు ఇవ్వనున్నట్లు అధికారులు ప్రకటిస్తున్నారు. అయితే చాలా ప్రాంతాల్లో వినాయక మండపాల నిర్వహణకు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా చవితి వేడుకలకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి మండపాలకు ‘ఉచిత’ విద్యుత్ అవకాశాలుండవనే సంకేతాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
ప్రాణాలు ముఖ్యం..
మన ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు అనే విషయాన్ని మరిచిపోవద్దు. గతంలో జిల్లాలో ఇదే సీజన్‌లో చాలా మంది యువత మృత్యువాత పడ్డారు. అలాంటి దుర్ఘటనలు జరుగకుండా ఉండాలంటూ కచ్చితంగా లైసెన్స్ ఉన్న ఎలక్ట్రీషియన్స్ మాత్రమే విద్యుత్ అలంకరణ పనులు చేపట్టాలి. వినాయక మండపాలకు ఉచిత విద్యుత్‌పై లిఖితపూర్వక ఆదేశాల మేరకు చర్యలు చేపడతాం.
– నాగిరెడ్డి కృష్ణమూర్తి,
ఎస్‌ఈ, శ్రీకాకుళం సర్కిల్

తస్మాత్ జాగ్రత్త..!