
దివ్యాంగుల పింఛన్లు తొలగించడం అన్యాయం
● ఎమ్మెల్సీ నర్తు రామారావు
ఇచ్ఛాపురం రూరల్: కూటమి ప్రభుత్వం పింఛన్ల పునః పరిశీలన పేరుతో దివ్యాంగుల పింఛన్లు తొలగించడం అన్యాయమని ఎమ్మెల్సీ నర్తు రామారావు మండిపడ్డారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 50 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు ఇస్తామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన కూటమి నాయకులు, గెలిచాక ఒక్క పింఛన్ ఇవ్వలేదు సరికదా.. ఉన్నవాటిని తొలగించి లబ్ధిదారుల ఉసురు పోసుకుంటున్నారని ధ్వజమొత్తారు. జిల్లాలో సుమారు 30 వేల మంది దివ్యాంగులకు అన్యాయం చేశారని, వారంతా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తే ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ఉద్దేశపూర్వకంగా పింఛన్ల ఏరివేతకు సిద్ధపడిన కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎండగట్టేందుకు వైఎస్సార్‌సీపీ బాధితుల తరుపున పోరాటం చేస్తుందని తెలియజేశారు. ఆయనతో పాటు మాజీ ఎంపీపీ కారంగి మోహనరావు, బాకి లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.