కన్యాకుమారి.. డైరెక్టర్ మనోడే మరి
● ‘కన్యాకుమారి’ చిత్ర దర్శకుడు సృజన్ సిక్కోలు వాసి
● శ్రీకాకుళం పరిసరాల్లోనే మొత్తం షూటింగ్
శ్రీకాకుళం అందాలను చూపించాం
సినిమా షూటింగ్‌లకు శ్రీకాకుళం జిల్లా చాలా అనుకూలంగా ఉంది. శ్రీకాకుళం చుట్టూనే సినిమా అంతా తీశాం. శ్రీకాకుళం జిల్లాలో పల్లె అందాలను చూపించనున్నాం. హీరోగా శ్రీ చరణ్ , హీరోయిన్‌గా గీత్ షైనీ నటించారు. ఇక్కడి యువతీ యువకుల మధ్య సాగే ప్రేమకథే ఈ సినిమా.
– సృజన్, దర్శకుడు
నరసన్నపేట: తెలుగు రాష్ట్రాల్లో విడుదలకు సిద్ధమైన ‘కన్యాకుమారి’ సినిమా డైరెక్టర్, నిర్మాత సృజన్ అట్టాడ మన సిక్కోలు వాసి. మొదటి సినిమా పుష్పక విమానంతో సత్తాచాటిన సృజన్ ద్వితీయ ప్రయత్నంగా కన్యాకుమారిని తెరకెక్కించారు. శాలిహుండం కొండపై వెలసిన వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రథమ పూజ చేసి సినిమా షూటింగ్ ప్రారంభించారు. నరసన్నపేట, పోలాకి మండలాల్లోని కోమర్తి, ఉర్లాం, చింతువానిపేట, లింగాలపాడు, దూకులపాడు, మాకివలస, దేవాది, మడపాం, రాళ్లపాడు, మబగాం, వీఎన్ పురం, శ్రీముఖలింగం గ్రామాల్లోనే దాదాపుగా సినిమా షూటింగ్ చేశారు. అలాగే కళింగ పట్నం తీరంలో కొన్ని షాట్లు తీశారు. శ్రీకాకుళంలోని ఒక వస్త్ర షోరూంలో హీరోయిన్ గీత్ షైనీపై సన్నివేశాలు చిత్రీకరించారు. స్థానిక యాసతోనే హీరో హీరోయిన్ల సంభాషణలు ఉండడం విశేషం. దర్శకుడు అట్టాడ సృజన్ కథా రచయత అట్టాడ అప్పలనాయుడు కుమారుడు. బుధవారం వినాయచవితి సందర్భంగా సినిమా రిలీజ్ చేస్తున్నారు.


