
ఎవరు ‘అధ్యక్షా’..?
టీడీపీ జిల్లా అధ్యక్ష స్థానానికి అభిప్రాయ సేకరణ
త్రిసభ్య కమిటీ నేతలతో హోంమంత్రి అనిత సమావేశం
ప్రాధాన్యత సంతరించుకున్న లక్ష్మీదేవి భేటీ
శ్రీకాకుళం : జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి ఎంపికకు కసరత్తు మొదలైంది. కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు శాసనసభ్యుల అభిప్రాయాలను సేకరించేందుకు హోం మంత్రి అనిత మంగళవారం శ్రీకాకుళం వచ్చారు. ఆమె నేతృత్వంలో త్రిసభ్య కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. అధ్యక్ష పదవి కోసం చౌదరి బాబ్జీ, మొదలవలస రమేష్, పీరుకట్ల విఠల్, ఆనెపు రామకృష్ణలు దరఖాస్తు చేసుకోగా.. అవకాశమిస్తే ఆ పదవి చేపట్టేందుకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావులు సంసిద్ధత వ్యక్తం చేశారు.
మహిళల కోటాలో తన పేరును కూడా పరిశీలించాలని తమ్మినేని సుజాత కోరారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ అభిప్రాయాలను అధిష్టానానికి నివేదిస్తామని తెలిపారు. అనుబంధ విభాగాల అధ్యక్షులపైనా అభిప్రాయాలను సేకరించామని చెప్పారు. ప్రతి విభాగానికి ఇద్దరు నుంచి ముగ్గురు పేర్లను అధిష్టానానికి నివేదిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు గొండు శంకర్, మామిడి గోవిందరావు, గౌతు శిరీష, కూన రవికుమార్, బెందాళం అశోక్, బగ్గు రమణమూర్తి, మాదారపు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేకంగా కలిసిన లక్ష్మీదేవి..
శ్రీకాకుళం మాజీ శాసన సభ్యురాలు గుండ లక్ష్మీదేవి హోం మంత్రి అనితతో ప్రత్యేకంగా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సుమారు 20 నిమిషాల పాటు భేటీ అయ్యారు. హోంమంత్రి ఇటీవల అరసవల్లి వచ్చినప్పుడు కూడా లక్ష్మీదేవి కలిసిన సంగతి తెలిసిందే. అయితే జిల్లా పార్టీ సమావేశాలకు ఆహ్వానం లేకపోవడంతో ఆమె ఇప్పటివరకు ఏ సమావేశంలోనూ పాల్గొనడం లేదని ప్రచారం జరుగుతుండగా, మంగళవారం మాత్రం హోంమంత్రితో సమావేశం కావడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.