విద్యతోనే ఉత్తమ భవిష్యత్
● సెంచూరియన్ వర్సిటీ ఛాన్సలర్
జీఎన్‌ఎన్ రాజు
ఎచ్చెర్ల: విద్యతోనే ప్రతి ఒక్కరికీ ఉత్తమ భవిష్యత్ లభిస్తుందని సెంచూరియన్ వర్సిటీ ఛాన్సలర్, ఆంధ్రా యూనివర్సిటీ పూర్వపు వీసీ ఆచార్య జీఎన్‌ఎన్ రాజు అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ ప్రవేశాలు పొందిన ప్రథమ సంవత్సరం విద్యార్థుల పరిచయ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థి ఉజ్వల భవిష్యత్తు అందుకోవడంలో అధ్యాపకులతో పాటు తల్లిదండ్రులకు కూడా బాధ్యత ఉందన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (గుంటూరు) పూర్వ వీసీ, బీఆర్‌ఏయూ అంబుడ్స్‌మెన్ ఆచార్య వి.బాలమోహన్‌దాస్ మాట్లాడుతూ మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా నేటి యువతరం మారితేనే కెరియర్ ఉంటుందన్నారు. ట్రిపుల్ ఐటీ (అగర్తల) పూర్వ డైరెక్టర్ ఆచార్య పీఎస్ అవధాని మాట్లాడుతూ విద్యార్థులు సమయపాలన కలిగి ఉండాలని సూచించారు. బీఆర్‌ఏయూ వీసీ కేఆర్ రజనీ మాట్లాడుతూ విద్యార్థులు ఒత్తిడి, అవాంతరాలు తట్టుకొని ఉన్నతంగా ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ఆచార్య బి.అడ్డయ్య, ఇంజినీరింగ్, ఆర్ట్స్ కళాశాలల ప్రిన్సిపాల్స్ డా.సీహెచ్ రాజశేఖరరావు, ఎం.అనురాధ, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎస్.ఉదయ్‌భాస్కర్, ఎస్‌వో డా.కె.సామ్రాజ్యలక్ష్మీ, ఇంజినీరింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రిన్సిపాల్ పి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


