
రోడ్డు ప్రమాదంలో యాచకురాలి మృతి
● ప్రమాదం చూసి తోటి యాచకుడు హఠాన్మరణం
జి.సిగడాం: మండలంలోని వాండ్రంగి పంచాయతీ చీడిపేట గ్రామంలో సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని యాచకురాలు బలగ భాగ్యం(50) అక్కడికక్కడే మృతి చెందింది. భాగ్యం మృతిని చూసి తోటి యాచకుడు కె.కోటి అక్కడే కూప్పకూలి మృత్యువాత పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. భాగ్యం, కోటి ఇద్దరూ చీడిపేటలో కలిసి జీవనం సాగిస్తున్నారు. వీరు జీవనోపాధిగా యాచక వృతి చేస్తున్నారు. సోమవారం ఉదయం 4 గంటల సమయంలో భాగ్యం కాలకృత్యాలు తీర్చుకోవడానికి రోడ్డు పక్కకు వెళ్లి ఉంటారని తెలిపారు. అదే సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో రోడ్డుపై మృతి చెందింది. భాగ్యంకు ప్రమాదం జరగడం చూసిన తోటి యాచకుడు కోటి(60) నలబై అడుగుల దూరంలోనే కుప్పకూలి మృత్యువాతపడ్డాడు. సమాచారం తెలుసుకుని ఎస్‌ఐ వై.మధుసూదనరావు, శ్రీకాకుళం క్లూస్ టీమ్, స్థానిక సర్పంచ్ సాకేటి నాగరాజు, పంచాయతీ కార్యదర్శి వడగా గౌరీశంకరావు, వీఆర్వో శివనారాయణ సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. భాగ్యం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజాం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు.

రోడ్డు ప్రమాదంలో యాచకురాలి మృతి