ఎరువులు ఎందుకు లేవు..?
టెక్కలి: జిల్లా రైతులకు అవసరమైన ఎరువుల్లో యూరియాను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఎందుకు కేటాయించలేకపోయారని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కమిటీ సభ్యుడు ఎన్.షణ్ముఖరావు నిలదీశారు. సోమవారం టెక్కలిలో కమిటీ సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఖరీఫ్‌లో రైతులకు అవసరమైన యూరియా దొరక్కపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో 42,200 మెట్రిక్ టన్నులకు పైగా యూరియా అవసరమైనప్పటికీ కేవలం 21,644 మెట్రిక్ టన్నుల యూరియాను మాత్రమే అందుబాటులో ఉంచారని విమర్శించారు. ఈ విషయంలో మంత్రి విఫలమయ్యారని పేర్కొన్నారు. అవసరమైన యూరియా అందజేయకపోతే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని గోవిందరావు హెచ్చరించారు. సమావేశంలో హెచ్.ఈశ్వరరావు, బి.వాసుదేవరావు, పోలయ్య, బి.అప్పారావు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.


