ఏటా పంట నష్టం
టీడీపీదే బాధ్యత
ఇబ్బంది పడుతున్నాం
● ముంపునకు గురవుతున్న వంశధార తీర గ్రామాలు ● వర్షమొస్తే వణుకుతున్న నదీ పరివాహక ప్రజలు ● పట్టించుకోని కూటమి ప్రభుత్వం
హిరమండలం/సరుబుజ్జిలి: – హిరమండలం మండలం గులుమూరు గ్రామం వంశధార నదిని ఆనుకుని ఉంటుంది. గొట్టా బ్యారేజీకి ముందు కూతవేటు దూరంలో ఉంది. ఎప్పుడు వంశధార ఉప్పొంగినా నీరు గ్రామంపైకి పోటెత్తుతుంది. అక్కడ కరకట్ట లేకపోవడంతో ఏటా వరదల సమయంలో ఆ గ్రామం చిగురుటాకులా వణికిపోతుంది.
● హిరమండలం మండలం పిండ్రువాడ, భగీరథపురం, మహాలక్ష్మీపురం గ్రామాల పరిధిలో పంట పొలాలకు ఏటా వరద ముంపు తప్పడం లేదు. వర్షాలు, వరదల సమయంలో గొట్టా బ్యారేజీ గేట్లు అన్నీ ఎత్తివేస్తారు. ఆ సమయంలో నీరు తీర గ్రామాల పొలాలపై పడుతుంది. ఇసుక మేటలు వేసి పంటలకు తీరని నష్టం కలుగుతుంది. కరకట్టలు లేకపోవడంతో ఏటా పంటలకు నష్టాలు తప్పడం లేదు.
●ఎల్‌ఎన్‌పేట మండలంలోని ఎల్‌ఎన్‌పేట, మిరియాబిల్లి, వాడవలస, దబ్బపాడు గ్రామాలు వంశధార తీరంలో ఉంటాయి. ఏటా వంశధార తీరం కోతకు గురై ఈ గ్రామాలతో పాటు పంట పొలాల్లోకి వరద నీరు చేరుతుంది. రోజుల తరబడి నిల్వ ఉండిపోతుంది. పంటలకు నష్టం వాటిల్లుతోంది. అదే కరకట్టలు ఉంటే ఈ పరిస్థితి ఉండదు. ఈ సమస్య ఈ రెండు మండలాల్లోనే కాదు.. దాదాపు 10 మండలాల వరకూ ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. వంశధారకు వరదొస్తే తీర గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. నదిలో నీటి మట్టం పెరిగే కొద్దీ ఆయా గ్రామాల ప్రజల గుండెల్లో రైళ్లు పరుగెడుతుంటాయి. ఒడిశా క్యాచ్‌మెంట్ ఏరియాలు అయిన మోహన, గుణుపూర్ ప్రాంతాల్లో వర్షాలు పడితే నదిలో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగిపోతుంది. దీంతో ఎక్కడికక్కడే నదీ తీరం కోతకు గురై సమీప గ్రామాలు, పంట పొలాల్లోకి నీరు చొచ్చుకెళుతుంది. పంట పొలాల్లో ఇసుక మేటలు వేసి ఇబ్బందికరంగా మారుతుంది. వేలాది ఎకరాల పంటలు ఏటా దెబ్బతింటాయి. అయితే ఈ సమస్యకు కరకట్టల నిర్మాణంతో చెక్ చెప్పవచ్చు. కానీ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం తీర గ్రామాల ప్రజలకు శాపంగా మారింది.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో వంశధార నదీ పరివాహక గ్రామాలుగా కొత్తూరు మండలంలో 14, హిరమండలంలో 10, ఎల్‌ఎన్‌పేటలో 3, సరుబుజ్జిలిలో 4, ఆమదాలవలసలో 5, శ్రీకాకుళం రూరల్‌లో 3, గారలో 4, జలుమూరులో 19, నరసన్నపేటలో 12, పోలాకి మండలంలో 12 గ్రామాలు ఉన్నాయి. ఏటా వర్షాలు, వరదల సమయంలో ఈ గ్రామాలకు భారీగా నష్టం జరుగుతోంది. 2018 ఎన్నికలకు ముందు అప్పటి టీడీపీ ప్రభుత్వం కరకట్టలంటూ హడావుడి చేసింది. ఎన్నికల స్టంట్‌గా మార్చింది. వంశధార నదికి ఇరువైపులా కరకట్టల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మొత్తం 4 ఫేజ్‌లుగా విభజించి పనులు మొదలుపెట్టింది. భామిని, కొత్తూరు, హిరమండలం మండలాల్లో మొదటి ప్యాకేజీ కింద.. ఎల్‌ఎన్‌పేట, సరుబుజ్జిలి రెండో ప్యాకేజీ కింద.. ఆమదాలవలస, శ్రీకాకుళం రూరల్, గార మూడో ప్యాకేజీ కింద.. నరసన్నపేట, జలుమూరు, పోలాకి నాలుగో ప్యాకేజీ కింద విభజించారు. తొలి ప్యాకేజీకి సంబంధించి టెండర్లు ఖరారు చేసి కేవలం 10 శాతం పనులు పూర్తిచేసి విడిచిపెట్టారు. ఇంతలో ఎన్నికలు రావడంతో ఆ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వంశధార ఫేజ్–2 రిజర్వాయర్, గొట్టా బ్యారేజీలో ఎత్తిపోతల పథకం, ఉద్దానం సమగ్ర మంచినీటి పథకాలను ప్రాధాన్యతాంశాలుగా భావించింది. దీంతో టీడీపీ ఆరంభశూరత్వంగా చేపట్టిన కరకట్టల జోలికి వెళ్లలేదు. అయితే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కరకట్టల నిర్మాణాన్ని ప్రారంభిస్తామని టీడీపీ కూటమి నేతలు హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకూ ఎటువంటి సన్నాహాలు చేయలేదు. దీంతో ఈ ఏడాది కూడా వంశధార తీర గ్రామాల ప్రజలకు ఆందోళనలు తప్పడం లేదు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం దృష్టిపెట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
పొంచి ఉన్న ముప్పు..
సరుబుజ్జిలి మండలంలోని అగ్రహారం, పాతపాడు, తెలికిపెంట, యరగాం, కాగితాపల్లి, పెదమాలపేట, పెద్దసవలాపురం, చినవెంకటాపురం, పాలవలస, పురుషోత్తపురం, అలమాజీపేట, ఫకీర్‌పాహెబ్‌పేట తదితర గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఆమదాలవలస మండలం నిమ్మతొర్లాడ, కొరపాం, బెలమాం, లొద్దలపేట, ముద్దాడపేట, కలివరం, తొగరాం, పొందూరు మండలం సింగూరు, బొడ్డేపల్లి, బూర్జ మండలం ఖండ్యాం, గుత్తావల్లి, నారాయణపురం గ్రామాలు నష్టాలు చవిచూస్తున్నాయి.
అనుమతులు రావాలి..
ఈ విషయమై కరకట్టల విభాగం ఈఈ వాసుదేవరావు మాట్లాడుతూ కొన్ని సాంకేతిక కారణాలు వలన కరకట్ట పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయని చెప్పారు. ప్రభుత్వం నుంచి నిధులు విషయమై అనుమతులు వస్తే పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
ఏటా వంశధార వరద పోటుతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు పనులు ప్రారంభించి పూర్తిచేయాలి. 2019 ఎన్నికల ముందు హడావుడిగా పనులు ప్రారంభించింది. ఇప్పుడు ఆ కరకట్టల నిర్మాణం గురించి పట్టించుకోకపోవడం దారుణం.
– ముద్దాడ లక్ష్మణరావు,
దబ్బపాడు, ఎల్‌ఎన్‌పేట మండలం
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వంశధార ఫేజ్ 2 రిజర్వాయర్ నిర్మాణానికి ప్రాధాన్యమిచ్చింది. గొట్టా బ్యారేజీలో ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని ప్రారంభించింది. ఉద్దానం సమగ్ర మంచినీటి పథకానికి సైతం చేపట్టింది. అందుకే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రారంభించిన కరకట్టల నిర్మాణం పూర్తిచేయాల్సిన బాధ్యత ఉంది.
– మీసాల భాస్కరరావు,
రైతు, భగీరథిపురం, హిరమండలం
నదిలో ఏ మాత్రం ప్రవాహం పెరిగినా వరదనీరు గ్రామంలోకి వస్తోంది. దీంతో పంటనష్టం కలుగుతోంది. కరకట్ట నిర్మాణం చేయకపోవడవం వల్ల విలువైన భూములు, ఇళ్లు కోల్పోతున్నాం. ఇప్పటికై నా పాలకులు స్పందించాలి.
–బి.మల్లేశ్వరరావు,
పాతపాడు, సరుబుజ్జిలి మండలం
కరకట్ట.. కనికట్టు!
కరకట్ట.. కనికట్టు!
కరకట్ట.. కనికట్టు!
కరకట్ట.. కనికట్టు!
కరకట్ట.. కనికట్టు!


