
ఉత్సాహంగా సాఫ్ట్‌బాల్ ఎంపికలు
శ్రీకాకుళం న్యూకాలనీ:
జిల్లాలో సాఫ్ట్‌బాల్ క్రీడను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తామని సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా ప్రధాన కార్యదర్శి సూర శ్రీనివాసరావు అన్నారు. జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సీనియర్స్ మహిళల సాఫ్ట్‌బాల్ ఎంపిక పోటీలు ఆదివారం శ్రీకాకుళం కోడిరామ్మూర్తి క్రీడా మైదానం వేదికగా ఉత్సాహభరితంగా జరిగాయి. జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు తరలివచ్చి తమ ప్రతిభ నిరూపించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి మొజ్జాడ వెంకటరమణ మాట్లాడుతూ గుంటూరు జిల్లా సత్తెనపల్లి వేదికగా ఈ నెల 30, 31 తేదీల్లో జరగనున్న ఏపీ రాష్ట్ర స్థాయి సీనియర్స్ మహిళల సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్–2025 పోటీల్లో పాల్గొనే జిల్లా జట్లను ఇక్కడ ఎంపిక చేయనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సాంబమూర్తి, డీఎస్‌డీవో డాక్టర్ శ్రీధర్‌రావు, సబ్ రిజిస్ట్రార్ గురుగుబెల్లి రాజు, జిల్లా పీఈటీ–పీడీ సంఘ అధ్యక్షుడు పి.తవిటయ్య, సహాధ్యక్షుడు మెట్ట తిరుపతిరావు, ఎస్.జీ.ఎఫ్ కార్యదర్శి బీవీ రమణ, హెచ్‌ఎం కె.హరిబాబు, సాఫ్ట్‌బాల్ సంఘ ప్రతినిధులు ఎం.ఆనంద్ కిరణ్, అన్నెపు రాజగోపాల్, గురుగుబెల్లి రాజశేఖర్, ఎ.డిల్లేశ్వరరావు, ఆర్కే మహంతి, మల్లేష్, పీడీలు పాల్గొన్నారు.