ఆదిత్యా నమోస్తుతే..!
అరసవల్లి: ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ స్వామి కొలువైన అరసవల్లి ఆదివారం భక్తజనంతో కిటకిటలాడింది. స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి ఆదిత్యునికి మొక్కులు చెల్లించుకున్నారు. పలువురు భక్తులు తలనీలాలను సమర్పించగా.. మరికొందరు ఆరోగ్యం కోసం సూర్యనమస్కారాల పూజలు చేయించుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణతో ఈ పూజలు నిర్వహించారు. అంతరాలయంలో భక్తులకు ఉదయం 6 గంటల నుంచే సర్వదర్శనాలకు ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ అనుమతించారు.
అవస్థలపై ఫిర్యాదులు..
దర్శనాల విషయంలో పలువురు భక్తులు ఈఓ కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. కేశఖండన శాలలో టిక్కెట్ల ధరకు మించి వసూళ్లు చేస్తున్నారని చెప్పారు. సూర్యనమస్కారాల పూజల వద్ద ఎక్కువ సమయం కింద కూర్చోవడానికి ఇబ్బందులు పడుతున్నామని, పీటలు వంటివి ఏర్పాటు చేస్తే అవసరమైన భక్తులకు వీలుగా వినియోగపడతాయనే అంశాన్ని ఈవో దృష్టికి తీసుకువెళ్లారు. ఒక్కొక్కరికి రూ.300 చొప్పున సూర్యనమస్కారాల పూజలకు వసూలు చేస్తున్నారని, దంపతులకు ఒకే టికెట్‌ను నిర్ణయించాలని కోరారు. వీటిని పరీశీలించి తప్పనిసరిగా అమలు చేస్తామంటూ ఈవో బదులిచ్చారు. కేశఖండన శాలలో అదనపు వసూళ్లు చేస్తున్న క్షురకుల నుంచి అపరాధ రుసుం వసూలు చేస్తామని చెప్పారు.
ఆదిత్యా నమోస్తుతే..!


