ప్రకృతి సేద్యానికి సై!
బహుళ ప్రయోజనాలు..
తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు
ఉత్పత్తులకు మార్కెట్‌లో గిరాకీ
భూసారం పెరుగుదలకు దోహదం
పంట గిట్టుబాటు
తక్కువ ఖర్చుతో సాగు..
కొత్తూరు:
ప్రకృతి విధానంలో వ్యవసాయం చేసే రైతుల సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా సహజంగా లభించే ఆవు పేడ, కషాయాలను పంట సాగుకు వినియోగిస్తూ ఆరోగ్యకరమైన ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. వీటికి మార్కెట్‌లో ఆదరణ బాగుండటంతో ప్రకృతి సేద్యం చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. వినియోగదారులకు ఆరోగ్యకరమైన పంట ఉత్పత్తులు అందించడంతో పాటు భూసారం పెంచేందుకు ప్రకృతి వ్యవసాయం ఎంతగానో దోహదం చేస్తున్నందున ప్రభుత్వాలు సైతం ప్రోత్సాహం అందిస్తున్నారు. జిల్లాలోని 30 మండలాల్లో సుమారు 77 వేలు మంది రైతులు సుమారు లక్ష ఎకరాల విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయం సాగు చేస్తున్నారు.
విస్తృత అవగాహన..
ప్రకృతి వ్యవసాయ సిబ్బంది తరచూ గ్రామాలకు వెళ్లి రైతులతో సమావేశమవుతున్నారు. ప్రకృతి సేద్యం వల్ల కలిగే లాభాలను వివరిస్తున్నారు. రసాయిన ఎరువులు, పురుగు మందులు వినియోగించడం వల్ల భూమికి, రైతులకు కలుగుతున్న నష్టాలను తెలియజేస్తున్నారు. అధిక ధరలు పలికే రసాయన ఎరువులకు బదులు తక్కువ ఖర్చుతో తయారు చేసుకునే జీవామృతం, బీజామృతం, నీమాస్త్రం, మీనామృతం వంటి కషాయాలపై అవగాహన కల్పిస్తున్నారు. వరి నాట్లు వేసే సమయంలో కాలిబాటలు వదలడం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. భూమి మరింత సారవంతంగా మారేందుకు పీఎండీఎస్ కిటు (నవధాన్యాలు కిట్లు) సైతం రైతులకు పంపిణీ చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం విధానంలో పంటల సాగు విస్తీర్ణం పెంచేందుకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. గత ఖరీఫ్ కంటే ఈ ఏడాది అన్ని రకాల పంటలు కలిపి సుమారు 40 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు.
ప్రకృతి వ్యవసాయం సాగు పెంచేందుకు చర్యలు..
ప్రకృతి వ్యవసాయం సాగు పెంచేందుకు పలు రకాలుగా చర్యలు చేపడుతున్నాము. ప్రకృతి వ్యవసాయం సాగు చేస్తున్న రైతులకు పీడీఎం కిట్లు తక్కువ దరలకు ఇవ్వడం జరిగింది. పలు రకాల కషాయాలు తయారు పై శిక్షణను రైతులకు ఇస్తున్నాము. సాగు విస్తీర్ణం పెంచేందుకు పొలం బడిలో కూడా రైతులకు ప్రకృతి వ్యవసాయం పద్దతులు పై అవగాహన కల్పిస్తున్నాము.
ప్రస్తుత సమాజంలో ఆరోగ్య స్పృహ పెరగడంతో ప్రకృతి వ్యవసాయ ఉత్పుత్తులకు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంటోంది. రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకుండా పంట ఉత్పత్తులు లభిస్తుండటంతో కొనుగోళ్లు బాగా జరుగుతున్నాయి.
దేశీయ ఆవుపేడతో జీవామృతం సొంతంగా తయారు చేసుకోవచ్చు. బీజామృతం, వేప కషాయాలు, మీన కషాయాల తయారీకి ఖర్చు తక్కువే.
రసాయన ఎరువులు బదులుగా పేడ, కుళ్లిన గత్తం వంటివి వాడితే భూమి సారం పెరుగుతుంది. వాన పాములు, ఇతర సూక్ష్మజీవులు పెరిగి జీవ వైవిధ్యం కాపాడతాయి.
రసాయన ఎరువులు వాడకపోవడం వల్ల ఆరోగ్యకరమైన పంట ఉత్పత్తులు లభిస్తాయి. పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. కూరగాయలు, పండ్లు రుచిగా ఉంటాయి.
వాతావరణంలో కాలుష్యం బాగా తగ్గుతుంది. భూమి సారవంతంగా మారుతుంది.
పర్యావరణ సమతుల్యతకు మేలు చేసే పక్షులు, పురుగులు, ఇతర జీవరాశులను సంరక్షించవచ్చు.
ప్రకృతి వ్యవసాయం ద్వారా పంట సాగు చేయ డం వల్ల పంట గిట్టుబాటు గా ఉంటోంది. పంట ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంటోంది. దిగుబడులు సైతం ఆశాజనకంగా ఉంటున్నాయి. భూమి సారవంతంగా మారుతుంది.
– ఎస్.అప్పారావు, ప్రకృతి వ్యవసాయ రైతు, లబ్బ గ్రామం, కొత్తూరు మండలం
ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో వరి పంట సాగు చేశాను. రసాయన ఎరువు లు, పురుగు మందులు వినియోగించకపోవడంతో ఖర్చు తగ్గింది. జీవామృతంతో పాటు ఇతర కషాయాలు పిచికారీ చేయడంతో ఆరోగ్యకరమైన పంట పండింది.
– అంపిలి బుచ్చిబాబు, ప్రకృతి వ్యవసాయ రైతు, గూనబద్ర, కొత్తూరు మండలం
ప్రకృతి సేద్యానికి సై!
ప్రకృతి సేద్యానికి సై!
ప్రకృతి సేద్యానికి సై!
ప్రకృతి సేద్యానికి సై!


