
ఆటో, క్యాబ్ డ్రైవర్లను ఆదుకోవాలి
రణస్థలం : రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో ఆదాయం కోల్పోయిన డ్రైవర్లకు ప్రత్యమ్నాయ ఉపాధి కల్పించాలని ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వామనమూర్తి డిమాండ్ చేశారు.
శనివారం రణస్థలం మండల కేంద్రంలో ఆటో, క్యాబ్ డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షలాది మంది నిరుద్యోగులు స్వయం ఉపాధి పథకం కింద ఆటోలు, వ్యానులు, జీపులు, కార్లు కొనుగోలు చేసి ప్రభుత్వానికి కోట్ల రూపాయల పన్నులు చెల్లిస్తున్న డ్రైవర్లకు జీవనోపాధి కరువై ఆందోళన గురౌతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఓలా, ఉబర్ ర్యాపిడో వంటి వాహనాలు ప్రవేశపట్టి డ్రైవర్లకు ఆదాయం లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ప్రకటించిన సంవత్సరానికి రూ.15వేలు ఆర్థిక సాయం వెంటనే ఇవ్వాలని, కాంపౌండ్ ఫీజులు పెంచే జీఓలు 21, 31 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భారీగా పెంచిన డీజిల్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వాహన విడిభాగాల ధరలు, టోల్ గేట్ ఫీజులు 30 శాతానికి తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రమాద బీమా రూ.10లక్షలు, సహజ మరణానికి చంద్రన్న బీమా రూ.5లక్షలు వెంటనే అమలు చేయాలని కోరారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.