
ఇద్దరు బైక్ దొంగలు అరెస్టు
పలాస: గరుడఖండి గ్రామానికి చెందిన కవిటి నిఖిలేశ్, గజపతి జిల్లా కాశీనగరం వాసి తూముల కార్తికేయ అనే ఇద్దరు బైక్ దొంగలను కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ వి.వెంకట అప్పారావు శనివారం కాశీబుగ్గ పోలీస్ డివిజనల్ కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. నిఖిలేశ్, కార్తికేయ శ్రీకాకుళంలోని ఒక ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి వరకు చదివారు. అనంతరం వ్యసనాలకు బానిసై దొంగతనాలకు పాల్పడుతుండేవారు. విశాఖపట్నంలో ఓ చోరీ కేసులోనూ పట్టుబడ్డారు. ఈ క్రమంలో నిఖిలేష్ మెళియాపుట్టిలోని తన బంధువుల ఇంటి నుంచి వస్తూ టెక్కలిపట్నంలో దాసరి సురేష్ అనే వ్యక్తి బైక్‌ను చోరీ చేసి పట్టుకుపోయాడు. అలాగే గార మండలానికి చెందిన మెండ వెంకటేశ్వరరావు కాశీబుగ్గలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వద్ద బైక్ ఉంచగా కార్తికేయ పట్టుకుపోయాడు. రెండు బైకులను విశాఖలో అమ్ముతుండగా సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. సమావేశంలో కాశీబుగ్గ సీఐ సూర్యనారాయణ పాల్గొన్నారు.