
uuరైతు కన్నీరులో కొట్టుకుపోతారు
● సర్కారును దునుమాడిన మాజీ స్పీకర్ తమ్మినేని ● ఎరువుల పరిశీలనకు వెళ్తున్న తమ్మినేనిని అడ్డుకున్న పోలీసులు
ఆమదాలవలస : శ్రీకాకుళం రోడ్ ఆమదాలవలస రైల్వే గూడ్స్ గోదాం వద్ద శనివారం ఉద్రిక్తత నెలకొంది. ఎరువులు రైతులకు సక్రమంగా అందడం లేదని, ఈ గోదాం నుంచి ఎరువులు పక్కదోవ పడుతున్నాయని కొందరు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆయన తన తనయుడు చిరంజీవి నాగ్‌తో కలిసి శనివారం రైతులకు న్యాయం చేయాలని ప్రయత్నించారు. అయితే పోలీసులు తొలుత చిరంజీవి నాగ్‌ను అడ్డుకున్నారు. అనంతరం పెట్రోల్ బంకు సమీపంలో తమ్మినేని అడ్డుకుని వెనక్కి వెళ్లాలని కోరారు. ఆయన మాత్రం రోడ్డుపైనే బైఠాయించారు. దీంతో ఆయనను జీపు ఎక్కించి నివాసానికి తరలించి పో లీసులను కాపలాగా ఉంచారు. అనంతరం తమ్మి నేని విలేకరులతో మాట్లాడారు. రైతు కన్నీరు పెడితే ఎవరైనా కొట్టుకుపోతారని అన్నారు. ఆమదాలవలసలో రైతు సేవా కేంద్రాల ద్వారా కూడా ఎరువులు ఇవ్వలేదన్నారు. తన రాజకీయ చరిత్రలో ఇలాంటి దుస్థితి ఎప్పుడూ చూడలేదన్నారు. నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల సమస్యలపై గతంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లానన్నారు. జిల్లావ్యాప్తంగా ఎరువులను ఆమదాలవలస కేంద్రంగా రైల్వే గూడ్స్ గోదాం నుంచి సరఫరా చేస్తారని, రైతు భరోసా కేంద్రాలకు, ఎరువుల డీలర్లకు ఇక్కడి నుంచే సరఫరా జరుగుతున్నప్పటికీ, కూట మి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ఎరువుల కొరత జిల్లాలో నెలకొందని అన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ఇలాంటి పరిస్థితులు లేవన్నారు. సమావేశంలో పార్టీ ముఖ్య నాయకులు బొడ్డేపల్లి నారాయణరావు, అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, పీఎసీఎస్ మాజీ అధ్యక్షుడు గురుగుబెల్లి శ్రీనివాసరావు, ప్రభాకరరావు, చల్ల సింహాచలం, బోర నర్సునాయుడు, తమ్మినేని వేణు, ఎం.వెంకటరమ ణ తదితరులు పాల్గొన్నారు.