
బార్‌లా తెరిచారు!
● మద్యం అమ్మకాలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
కూటమి ప్రభుత్వం మందుబాబులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. తాగినోడికి తాగినంత అన్నట్టు కొత్త బార్‌లతో ముందుకొచ్చింది. జిల్లాలో ఇప్పటికే ఏరులై పారుతున్న మద్యం ప్రవాహం ఇకపై మరింత ఉద్ధృతంగా ప్రవహించనుంది. ఒకవైపు విచ్చలవిడిగా దొరుకుతున్న గంజాయి.. మరోవైపు నాటు సారా.. ఎక్కడికక్కడే అందుబాటులోకి వచ్చిన మద్యం వెరసి రాత్రి పూట గొడవలు, న్యూసెన్స్ పెరిగే అవకాశం ఉండటం పోలీసులకు సవాల్‌గా మారింది.
తాగించడమే పనిగా..
కూటమి ప్రభుత్వం మందుబాబులను పూర్తిగా తాగించడమే పనిగా పెట్టుకుంది. ఎంత ఎక్కువగా మత్తులో ముంచితే అంత ఎక్కువ ఆదాయం వస్తుందని భావిస్తోంది. దానికోసం అన్ని రకాల వెసులుబాట్లు కల్పిస్తోంది. ఇప్పటికే జిల్లాలో 176 మద్యం దుకాణాలను ఏర్పాటు చేసింది. లైసెన్సు షాపులతో సరిపోదని బెల్ట్‌షాపులను ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే వీధికి ఐదు, పది బెల్ట్‌షాపులు నడుస్తున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వానికి మద్యం దాహం తీరడం లేదు. లైసెన్స్ షాపుల వద్దే తాగేందుకు ఏర్పాట్లు చేసింది. పర్మిట్ రూమ్‌లకు అనుమతిచ్చింది. దీంతో లైసెన్సు షాపుల వద్ద మందుబాబుల సందడే సందడి. ఇప్పుడు లైసెన్సు దుకాణాలకు, పర్మిట్ రూమ్‌లకు, బెల్ట్‌షాపులకు అనుబంధంగా బార్‌ల ఏర్పాటుకు నోటిఫికేషన్ ఇచ్చింది. జిల్లాలో 19 బార్‌లు ఏర్పాటుకు, వాటికి అనుబంధంగా రెస్టారెంట్‌లకు క్లియరెన్స్ ఇచ్చింది. శ్రీకాకుళం, పలాస, ఆమదాలవలస, ఇచ్ఛాపురం మున్సిపాల్టీల్లో అత్యధిక బార్‌లు ఏర్పాటు కాబోతున్నాయి.
అర్ధరాత్రి వరకు మద్యం సరఫరా..
గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఏటా మద్యం దుకాణాలతో పాటు బార్‌ల సంఖ్య తగ్గిస్తూ వచ్చింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కఠినంగా వ్యవహరించింది. బార్‌లు కూడా ఉదయం 11 నుంచి రాత్రి 11 గంటల వరకే మూసివేయాలని ఆదేశించింది. కానీ, కూటమి ప్రభుత్వం ఉదయం 10 నుంచి అర్ధరాత్రి 12గంటల వరకూ బార్‌లు తెరుచుకునేలా ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో విచ్చలవిడితనం మరింత పెరిగిపోనుంది. ఇప్పటికే మద్యం దుకాణాల వద్ద గొడవలు జరుగుతున్నాయి. ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. దాడులు పెరిగాయి. చాలా చోట్ల మద్యం దుకాణాలు న్యూసెన్స్‌గా తయారయ్యాయి. ఇక, బెల్ట్‌షాపుల కారణంగా గ్రామాల్లో చెప్పనక్కర్లేదు. మందుబాబుల జాతరే కనబడుతోంది. పల్లెల ప్రశాంతతకు చిచ్చు
పెట్టింది.
విచ్చలవిడిగా నాటుసారా..
ఒకవైపు ప్రభుత్వమే మందుబాబుల వద్దకు మద్యం సరఫరా చేస్తుండగా, ఇంకోవైపు ఒడిశా సరిహద్దు ప్రాంతంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో నాటుసారా కూడా తయారవుతోంది. పలాస, నరసన్నపేట, పాతపట్నం, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, టెక్కలి నియోజకవర్గాల్లో నాటు సారా ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రభుత్వం సరఫరా చేస్తున్న మద్యం కంటే తక్కువ ధరకు దొరకడంతో చాలా మంది ఆకర్షితులవుతున్నారు. వైన్‌కు వెచ్చించేంత స్థోమత లేని వారంతా నాటుసారా బారిన పడుతున్నారు.
గుప్పుమంటున్న గంజాయి..
గంజాయి విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఇందుకు నిత్యం దొరుకుతున్న గంజాయి కేసులే నిలువెత్తు సాక్ష్యాలు. విక్రయాలు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ప్యాకెట్, లిక్విడ్, చాక్లెట్ రూపంలో విక్రయిస్తున్నారు. ఒడిశా, పాడేరు నుంచి జిల్లాకు ఎక్కువగా గంజాయి దిగుమతి అవుతోంది. ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు, జిల్లాలకు రవాణా అవుతోంది. ఇచ్ఛాపురం, పలాస, శ్రీకాకుళం , ఆమదాలవలస, పాతపట్నం తదితర ప్రాంతాల్లో గంజాయి కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నట్టు నమోదవుతున్న కేసులే సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
పోలీసులకు కష్టతరమే..
ఒకవైపు గంజాయి, మరోవైపు విచ్చలవిడిగా దొరుకుతున్న మద్యంతో జిల్లాలో చాలా చోట్ల గొడవలు జరుగుతున్నాయి. ఘర్షణ పడిన వారు ఏ మైకంలో ఉన్నప్పటికీ గంజాయి మత్తు అని చెబితే ఇబ్బంది అని మద్యం ఖాతాలో వేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏదేమైనా అటు మద్యం, ఇటు గంజాయితో ఇబ్బందికరంగా తయారైంది. తాజాగా పర్మిట్ రూమ్‌లు, అర్ధరాత్రి వరకు బార్లు తెరిచి ఉంచే అవకాశం ఇవ్వడంతో విచ్చలవిడితనం మరింత పెరిగిపోవడం ఖాయం. ప్రభుత్వమే అధికారికంగా అర్ధరాత్రి 12గంటల వరకు తాగే అవకాశం ఇవ్వడంతో ఏ సమయంలో ఏం జరుగుతుందో ఊహించలేని పరిస్థితి నెలకొంది. ఆ సమయం వరకు మందుబాబులపై నిఘా పెట్టాలి. లేదంటే మత్తులో ఏ దుశ్చర్యకు పాల్పడతారో చెప్పలేం. మొత్తానికి కూటమి ప్రభుత్వం తెచ్చిన మద్యం పాలసీ పోలీసులకు సవాల్‌గా మారిందనే చెప్పాలి.
ఇకపై ఉదయం 10 నుంచి అర్ధరాత్రి
12 గంటల వరకు బార్‌లకు అనుమతి
ఇప్పటికే మద్యం
దుకాణాలు, పర్మిట్ రూమ్‌లు
విచ్చలవిడిగా బెల్ట్‌షాపులు
జిల్లాలో పెరగనున్న న్యూసెన్స్
పోలీసులకు సవాల్‌గా కూటమి మద్యం పాలసీ

బార్‌లా తెరిచారు!

బార్‌లా తెరిచారు!

బార్‌లా తెరిచారు!