
ఒక్క లేఖ..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఒకే ఒక్క లేఖ.. మన జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేషీని వేలెత్తి చూపించింది. ఇప్పుడది జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఏపీ ఆగ్రోస్ జనరల్ మేనేజర్‌గా పనిచేసిన రాజమోహన్ ప్రభుత్వానికి రాసిన లేఖతో అచ్చెన్నాయుడు పేషీ అవినీతికి కేంద్రంగా మారిందన్న ఆరోపణలకు తావిచ్చింది. ఇప్పుడంతా ఆయన దగ్గర పనిచేస్తున్న ఓఎస్డీపైనే చర్చ నడుస్తోంది. ఎవరా ఓఎస్డీ.. ఏంటా కథ.. అని ఆరా తీస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి.
చెప్పిన మాట వినలేదని..
వ్యవసాయ యంత్ర పరికరాల తయారీదారులు, వ్యవసాయ శాఖ మంత్రి పేషీకి మధ్యవర్తిగా వ్యవహరించాలని ఓఎస్డీ కోరినట్టు ఏపీ ఆగ్రోస్ జనరల్ మేనేజర్ రాజమోహన్ ఏకంగా చీఫ్ సెక్రటరీతో పాటు ఏపీ ఆగ్రోస్ వైస్ చైర్మన్, ఎండీకి లేఖ రాశారు. ఓఎస్డీ చెప్పినట్టు వినలేదన్న అక్కసుతో తనను వేధించినట్టు.. ఆ ఒక్క కారణంతో తనను నెల్లూరుకు బదిలీ చేశారని లేఖలో ప్రస్తావించారు. సెలవుపై వెళ్లడం తప్ప మరో మార్గం కన్పించడం లేదని వెల్లడించారు. తన స్థానంలో కేసులు పెండింగ్‌లో ఉన్న జూనియర్ అసిస్టెంట్ కేడర్ గల వారిని నియమించారని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ లేఖ బయటకు రావడమే తరువాయి.. మంత్రి అచ్చెన్నాయుడిపైన, ఆయన పేషీ పైన, సదరు ఓఎస్డీపైన విస్తృత చర్చ జరుగుతోంది.
సూత్రధారిగా..
అచ్చెన్నాయుడు మంత్రి అయిన ప్రతీసారి ఓఎస్డీగా, వ్యక్తిగత సిబ్బందిగా ఉన్న ఒక ‘నాయుడు’ పాత్రపైనే ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ఆయన చేసే ప్రతీ కార్యక్రమంలో వచ్చే ప్రయోజనాలు చివరికి ఎవరికి వెళ్తున్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదని.. కానీ అన్నింటికీ సూత్రధారి ఆ ఓఎస్డీయే అని మాట్లాడుకుంటున్నారు. జిల్లాలో ఆయన కోసం తెలిసిన ప్రతీ ఒక్కరూ పేషీలో ఏదో చేసే ఉంటాడని చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఆ ఓఎస్డీపై ఎల్లోమీడియాలో కూడా కథనాలు వచ్చాయని, ఆయన ఎంత బరితెగించకపోతే ఆ మీడియాలో తప్పని పరిస్థితుల్లో కథనాలు ఇచ్చి ఉంటారో అర్ధం చేసుకోవచ్చని, అయినప్పటికీ వెనక్కి తగ్గడం లేదని విస్తృత చర్చ నడుస్తోంది. ఇక, అచ్చెన్నాయుడిపై ఆరోపణలు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులో ఈఎస్‌ఐ స్కామ్ ప్రత్యేకమైనది.
హాట్ టాపిక్
రచ్చగా మారిన అచ్చెన్న పేషీ
మంత్రి ఓఎస్డీపై ఆరోపణలు
ఆగ్రోస్ జీఎం ప్రభుత్వానికి రాసిన లేఖతో విస్తృత చర్చ

ఒక్క లేఖ..