
సుందరీకరణే ముద్దు
సౌకర్యాలు
వద్దు..
శ్రీకాకుళం : పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారింది జిల్లా కేంద్రంలోని రిమ్స్ సర్వజన ఆస్పత్రి పరిస్థితి. 930 పడకలతో పెద్దాసుపత్రిగా కొనసాగుతున్నా వాస్తవానికి మాత్రం ఇక్కడ ఉన్నవి 650 మాత్రమే. సీజనల్ వ్యాధులు ప్రబలే సమయంలో ఈ పడకలు ఏ మూలకూ సరిపోవు. దీంతో పలువురు రోగులు గత్యంతరం లేక ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఆస్పత్రి ఆవరణలో నిర్వహణకు నోచుకోని వందలాది మంచాలు ఉన్నాయి. వీటిని భవనాల టెర్రస్‌పై, కొన్ని వార్డు గదుల్లో పడేసి వినియోగంలో లేకుండా చేసేశారు. ఇటు రిమ్స్ అధికారులు గానీ, అటు ఇంజినీరింగ్ అధికారులు గానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. వీటిని జిల్లా అధికారులు, రాష్ట్ర అధికారుల అనుమతితో పాత సామాన్లుగా విక్రయిస్తే ఆ మొత్తంతో 300కు పైగా మంచాలను కొనుగోలు చేయవచ్చని వైద్యులే చెబుతుండటం గమనార్హం.
ఇదేం తీరు..
ఇంజినీరింగ్ అధికారులు సుమారు రూ.12 లక్షలను రిమ్స్ ప్రాంగణంలో సుందరీకరణ పేరిట మొక్కలు నాటడం వంటి పనులకు ఖర్చు చేస్తున్నారు. ఈ మొత్తాన్ని వెచ్చిస్తే 300 పడకలతో పాటు నిరుపయోగంగా ఉన్న కొత్త హాస్టల్ భవనాలు వినియోగించుకునేందుకు అవసరమైన ఫర్నిచర్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. అయితే మంత్రి, కలెక్టర్ సుందరీకరణ చేయాలని చెప్పినట్లు ఇంజినీరింగ్ అధికారులు పేర్కొనడం గమనార్హం. రోగులకు అవ సరమైన వాటిని పక్కన పెట్టి సుందరీకరణ కోసం అంచనాల రూపొందించి వాటిని రిమ్స్ అధికారులతో ఆమోదింప చేయడం పట్ల ఆసుపత్రి వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. సౌకర్యాల కోసం కాకుండా సుందరీకరణ కోసం రిమ్స్ సూపరింటెండెంట్ ఏ విధంగా అంగీకరించారో అర్థం కావడం లేదని వైద్యులే చెబుతున్నారు.
గదులూ కొరతే..
రిమ్స్‌లో చదువుతున్న ఎంబీబీఎస్, పీజీ విద్యార్థులకు వసతి సమస్య వేధిస్తోంది. కొత్త భవనాలు నిర్మించినా ఫర్నిచర్ లేదన్న కారణంగా వాటిని రిమ్స్ అధికారులు రెండేళ్లుగా స్వాధీనం చేసుకోవడం లేదు. పలు వార్డు గదుల్లో పాత ఫర్నిచర్ పడేయడం వల్ల అవి కూడా నిరుపయోగంగా మారాయి. చాలా భవనాల్లో గదులను కొందరు ఇతర శాఖల అధికారులు, రిమ్స్‌లోని కొన్ని విభాగాల ఉద్యోగులు తమ ఆధీనంలో ఉంచుకోవడం కూడా గదుల కొరతకు కారణంగా నిలుస్తోంది. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి, కుష్టు నివారణ అధికారితో పాటు శానిటేషన్ ,సెక్యూరిటీ ఇలా ఎంతోమంది గదులను తమ ఆధీనంలో ఉంచుకున్నారు. ఇదే సమయంలో హెచ్‌ఆర్‌ఏను మాత్రం జీతంతో పాటు తీసుకోవడం గమనార్హం. ఇప్పటికై నా జిల్లా అధికారులు దృష్టి సారించి పేద రోగులకు, వైద్య విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.
రిమ్స్ లో వింత పరిస్థితి
పడకల కొరత ఉన్నా పట్టించుకోని అధికారులు
సుందరీకరణ పేరిట మొక్కలు
ఏర్పాటు చేస్తున్న వైనం
సరిపడా మంచాలు లేక ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న బాధితులు
మంత్రి ఆదేశాల మేరకే..
మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ రిమ్స్ ఆవరణను సుందరీకరణగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. అందుకోసమే పది లక్షల రూపాయలు వెచ్చిస్తున్నాం. ఈ అంచనాలకు అడ్మినిస్ట్రేటర్‌పాటు సూపరింటెండెంట్ ఆమోదించారు.
– సత్య ప్రభాకర్,
ఈఈ ఏపీహెచ్‌ఎంహెచ్‌ఐడీసీ