
గీత కులాలకు రెండు బార్లు
శ్రీకాకుళం క్రైమ్ : రాష్ట్ర ప్రభుత్వ నూతన మద్యం పాలసీలో భాగంగా గీత కులాలకు జిల్లాలో రెండు బార్లు కేటాయించనట్లు జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి సీహెచ్ తిరుపతినాయుడు బుధవారం పేర్కొన్నారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరోషన్‌లో శ్రీశయన కులానికి ఒకటి, పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో సొండి కులస్తులకు మరో బార్ కేటాయించినట్లు తెలిపారు. దరఖాస్తులు ఈ నెల 29లోగా అందించాలని, దరఖాస్తు రుసుం రూ.5 లక్షలు, ప్రాసెసింగ్ ఫీజు రూ.10 వేలు ఉంటుందని పేర్కొన్నారు. ఏడాది కాలానికి రూ.27.50 లక్షలు లైసెన్సు ఫీజు కట్టాలని, లాటరీ పద్ధతిన ఈ నెల 30న కలెక్టర్ కార్యాలయం వద్ద డ్రా తీస్తామని తెలిపారు.
ఐటీఐలో మిగులు సీట్ల భర్తీకి నోటిఫికేషన్
ఎచ్చెర్ల : ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలలో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి మూడో విడత నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్, జిల్లా కన్వీనర్ ఎల్.సుధాకరరావు బుధవారం తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 26 లోగా ఐటీఐ.ఏపీ.జీవోవీ.ఇన్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ పత్రంతో పాటు విద్యార్హతల సర్టిఫికెట్లతో ఈ నెల 27న నిర్దేశిత ఐటీఐలో వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో 29న, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో 30న కౌన్సెలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు.
చిత్తశుద్ధితో పనిచేయండి
అరసవల్లి: జిల్లా పరిషత్ యాజమాన్యంలో కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు పొందిన వారు చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని జెడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయ అన్నారు. బుధవారం జెడ్పీ బంగ్లా వద్ద పలువురికి కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. కొండగొర్రి రాహుల్(భామిని మండల పరిషత్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్), తీడ తేజేశ్వరరావు(జెడ్పీలో జూనియర్ అసిస్టెంట్), సూరవజ్జల రాజ్యలక్ష్మి(హరిపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్), వేమూరి నాగమణి(జెడ్పీలో జూనియర్ అసిస్టెంట్)లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో ఎల్.ఎన్.వి.శ్రీధర్, డిప్యూటీ సీఈవో డి.సత్యనారాయణ తదితరులున్నారు.
24న ఇచ్ఛాపురంలో
జానపద సంబరాలు
ఇచ్ఛాపురం రూరల్: ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా మహతీ సాంస్కృతిక కళా సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 24న జానపద సంబరాలు నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఈదుపురం రామాలయం వద్ద కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ నెల 24న ఇచ్ఛాపురం రోటరీ క్లబ్ వద్ద జానపదం, కోలాటం, సంబల్‌పురీ భూం బాగోతం, కోయనృత్యం వంటి ప్రదర్శనలు జరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో అధ్యక్షుడు రంగాల జానకిరామ్, వ్యవస్థాపక కార్యదర్శి తిప్పన ధనుంజయరెడ్డి, ఉపాధ్యక్షుడు నర్తు గంగయ్య, ప్రచార కార్యదర్శి చలపరాయి వినోద్, కోశాధికారి కొప్పల హేమంత్, కారంగి త్రినాధ్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

గీత కులాలకు రెండు బార్లు