
మేలుకోకుంటే నష్టం
ముంచేసిన వర్షం..
ఆమదాలవలస: జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు వ్యవసాయ పొలాల్లో నీరు కనిపిస్తోంది. కాలువల ద్వారా పొలాల్లోకి సాగునీరు చేరింది. అయితే వంశధార, నాగావళి నదీ పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే వెద పద్ధతిలో వరి సాగు చేస్తున్న రైతులు అప్రమత్తంగా ఉండాలని, పంట నీట మునిగితే ఎదుగుదలకు ఆటంకం కలిగే అవకాశం ఉందని ఆమదాలవలస వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.చిట్టిబాబు తెలిపారు. ఈ తరుణంలో వరితోపాటు వివిధ పంటల్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులను వివరించారు. జిల్లాలో ఇప్పటివరకు వరి పంట 1.30 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. అలాగే మొక్కజొన్న 9,000 హెక్టార్లు, పత్తి పంట 850 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ఈ పంటల్లో జాగ్రత్తలు పాటిస్తే నష్ట నివారణ చర్యలు చేపట్టవచ్చని పేర్కొన్నారు.
వరి పంటలో...
జూన్, జూలై నెలల్లో ముందుగా వెదజల్లిన వరిపంట పిలక దశకు చేరుకుంది. ఇంద్ర(ఎంటీయూ 1061), అమర ఎంటీయూ (1064) వంటి రకాలు కొంతవరకు ముంపును/అధిక నీటిని తట్టుకోగలవు.
● పొలాల నుంచి నీరు బయటకు పోయేలా మార్గాలు ఏర్పాటు చేయాలి. పంట పాక్షికంగా దెబ్బ తిన్నట్లయితే పంటలో ఒత్తుగా ఉన్న పిలకలను తీసి పలుచగా ఉన్నచోట నాటుకోవాలి. అలాగే పంట ఎదుగుదలకు ఎకరాకు 20 – 25 కిలోల యూరియా, 15 కిలోల పొటాష్ వేయాలి. లేదా నానో యూరియా ఎకరానికి అరలీటర్ చొప్పున పిచికారీ చేసుకోవాలి.
● పంటమీద తెగుళ్లు రాకుండా ఉండేందుకు కార్బండిజం ఒక గ్రాము లేదా మాంకోజెబ్ రెండు గ్రాము లు ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
● నాట్లు వేసే రైతులకు ఈ వర్షాలు అనుకూలం కాబట్టి 30 నుంచి 35 రోజుల ఆరోగ్యవంతమైన నారు నాటుకోవాలి. నారు ముదిరితే దగ్గర దగ్గరగా కుదురుకు ఎక్కువ పిలకలు ఉండేటట్లు చూసుకోవాలి.
● నాట్లువేసిన వారం రోజులు లోపు తప్పనిసరిగా 50 కిలోల డీఏపీతో పాటు పది కిలోల పొటాష్ ఎరువును వేసుకోవాలి.
● అలాగే నాట్లు వేసిన వారం రోజులకు ప్రతీ రెండు మీటర్లకు 20 సెంటీ మీటర్లు చొప్పన కాలిబాటలు తీయాలి.
మొక్కజొన్న పంటలో...
జూన్ మాసంలో విత్తుకున్న మొక్కజొన్న పైరు పూత దశలో, జూలై నెలలో విత్తుకున్న పైరు మోకాలు ఎత్తు దశలో ఉంటుంది. – పూత దశలో ఉన్న పైరుకు ఎకరాకు 50 కిలోల యూరియా, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను పైపాటుగా వేయాలి.
● 25 నుంచి 30 రోజుల వయసున్న పైరులో అంతర కృషి జరిపి, ఎకరాకు ఒక బస్తా యూరియాను పైపాటుగా వేసుకొని, మట్టిని మొక్కల వేర్లుకు ఎగదోయాలి.
● ఎక్కువ వర్షపాతం నమోదైనప్పుడు లేత పైరు అధిక తేమను తట్టుకోలేదు. ఈ పరిస్థితిని నివారించుటకు పొలం నుంచి వర్షపు నీటిని మురుగు నీటి కాలువల ద్వారా బయటకు తీయాలి.
● ఎకరాకి 25 కిలోల యూరియా, పది కిలోల పొటాష్ ఎరువులను అదనంగా వేయాలి.
పత్తి పంటలో...
ప్రత్తి పంట అధిక తేమను తట్టుకోలేదు. ఆకులు మొదట గులాబీ రంగుకు మారి, తర్వాత పూర్తిగా ఎర్రబడి, ఎండిపోయి రాలిపోతాయి.
● పొలంలో కాలువలు తీసుకొని నీటిని బయటకు పంపించాలి.
● నెలరోజులు దాటిన పంట అధిక వర్షాలకు గురైతే, పంట ఎదుగుదలకు ఎకరాకు 25 కిలోలు యూరియా, 10 కిలోల పొటాష్ ఎరువులను అదనంగా వేయాలి.
● లేదా లీటరు నీటికి 10 గ్రాములు మెగ్నీషియం సల్ఫేట్ మరియు 10 గ్రాముల యూరియా/డీఏపీ కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
● వేరుకుళ్లు తెగులు ఆశించకుండా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములను లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్లును తడపాలి
పంటల్లో సస్యరక్షణ చర్యలు తప్పనిసరి
వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు
వరి పంటను పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు

మేలుకోకుంటే నష్టం