
బదిలీల సమస్య పక్కదారి పడుతోంది
● డీటీఎఫ్ నాయకుడు పేడాడ కృష్ణారావు
శ్రీకాకుళం: జిల్లాలో ఇటీవల జరిగిన ముగ్గురు కేజీబీవీ ప్రిన్సిపాల్స్ బదిలీల సమస్య పక్కదారి పడుతోందని, రాజకీయ సమస్యగా మారుస్తున్నారని డీటీఎఫ్ నాయకుడు పేడాడ కృష్ణారావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లోలుగు కేజీబీవీ నుంచి కంచిలికి బదిలీ అయిన ప్రిన్సిపాల్ సౌమ్య, ఆమదాలవలస నియోజకవర్గ టీడీపీ నాయకుల మధ్య జరుగుతున్న ఆరోపణలతో అసలు విషయం మరుగున పడుతోందన్నారు. జిల్లా అధికారులు, అధికార పార్టీ నాయకులు చెబుతున్నట్లుగా లోలుగు కేజీబీవీ నుంచి కంచిలికి బదిలీ అయిన సౌమ్య అక్రమాలకు పాల్పడితే సుదూర ప్రాంతానికి బదిలీ చేయడం మంచిదేనన్నారు. అయితే కంచిలి కేజీబీవీ ప్రిన్సిపాల్‌ను జిల్లా కేంద్రం సమీపంలోని కేజీబీవీకి ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చిందో అధికారులు, అధికార పార్టీ పెద్దలు చెప్పకపోవడం విచారకరమన్నారు. అలాగే గారలో పనిచేస్తున్న ప్రిన్సిపాల్‌ను పొందూరు ఎందుకు బదిలీ చేశారని ప్రశ్నించారు. సౌమ్య నిజంగానే అవినీతి చేసి ఉంటే, విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టి ఇద్దరిని మాత్రమే బదిలీ చేస్తే సమంజసంగా ఉండేదని, ముగ్గురుని ఎందుకు బదిలీ చేశారో కారణాలను ఎస్‌ఎస్‌ఏ అధికారులు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం బదిలీలకు గల కారణాలను వెల్లడించి, సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరారు.
సత్తాచాటిన ప్రజ్ఞామణి
సోంపేట: నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్‌బీఈఎంఎస్) నీట్ పీజీ ఫలితాల్లో సోంపేటకు చెందిన విద్యార్థిని గేదెల ప్రజ్ఞామణి జాతీయ స్థాయిలో 1,039వ ర్యాంకు సాధించి సత్తా చాటింది. ఈమె ఆంధ్రా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసుకుంది. పీజీ ఫలితాల్లో సత్తా చాట డంతో తల్లిదండ్రులు, స్థానికులు అభినందించారు.