
దేశానికి మోదీనే బ్రాండ్
● ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్
శ్రీకాకుళం న్యూకాలనీ: భారతదేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే పెద్ద బ్రాండ్ అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. ఏపీ బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి శ్రీకాకుళంలో బుధవారం పర్యటించిన మాధవ్‌కు జిల్లా నాయకులు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. నగరంలోని ఒక ప్రైవేటు హోటల్‌లో పార్టీ శ్రేణులతో సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఉమ్మడిగా పోటీ చేసేవిధంగానే చర్యలు తీసుకుంటామన్నారు. బీజేపీ నాయకులంతా పోటీ చేసేందుకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రపంచపటంలో శ్రీకాకుళం జిల్లాకు ఒక ప్రత్యేక స్థానం, గుర్తింపు ఉందని కొనియాడారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాధవ్ మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సైల్‌లో మెర్జ్ చేయాలని బీజేపీ రాష్ట్ర శాఖ తరుపున సూచించినట్లు పేర్కొన్నారు. దేశంలో స్టీల్ ప్లాంట్లు కాపాడిన ఘనత బీజేపీదేనని, కొత్త పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తామని, మూలపేట పోర్టు, భోగాపురం ఎయిర్‌పోర్టు త్వరితగతిన పూర్తిచేసేలా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదిటి ఈశ్వరరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు, ముఖ్య నాయకులు పూడి తిరుపతిరావు, పైడి వేణుగోపాలం, శవ్వాన ఉమామహేశ్వరి, అట్టాడ రవిబాబ్జి, బిర్లంగి ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.
పోక్సో కేసు నమోదు
రణస్థలం: మండలంలోని పైడిభీమవరం గ్రామానికి చెందిన బాలికపై ఇప్పిలి సతీష్ అనే వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించడంతో జేఆర్‌పురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పైడిభీమవరం హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న బాలిక మంగళవారం రాత్రి ఇంటి వద్ద ఉన్న సమయంలో, కనిమెట్ట గ్రామానికి చెందిన ఇప్పిలి సతీష్ అనే వ్యక్తి మద్యం తాగి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు అతడికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటనపై ఎస్‌ఐ ఎస్.చిరంజీవి పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
మెళియాపుట్టి: మండలంలోని గోకర్ణపురం గ్రామ పంచాయతీ చినహంస గ్రామానికి చెందిన లండ రామారావు అనే వ్యక్తి మృతదేహం బుధవారం లభ్యమైంది. ఒడిశాలోని రాధా సాగరంలో రామారావు గల్లంతైన విషయం తెలిసిందే. బుధవారం మృతదేహం ఒడ్డుకు కొట్టుకురావడంతో స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఒడిశా పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పర్లాకిమిడి జిల్లా ఆస్పత్రికి తరలించారు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి మృత్యువాతపడడంతో భార్య లక్ష్మి రోదనలు మిన్నంటాయి.
అక్రమంగా మూగజీవాలు తరలింపు
కంచిలి: ఒడిశా రాష్ట్ర పరిధి గొలంత్ర గ్రామం నుంచి విజయనగరం జిల్లా అలమంద సంతలో అమ్మేందుకు తరలిస్తున్న 12 గేదెలను కంచిలి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఉదయం కంచిలి ఫ్‌లై ఓవర్ బ్రిడ్జి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక వాహనంలో ఈ గేదెలను ఆక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి పట్టుకున్నారు. వీటిని తరలిస్తున్న నలుగురుపైన కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్‌ఐ పి.పారినాయుడు తెలిపారు.
ఎచ్చెర్ల: మండలంలోని జరజాం గ్రామ సచివాలయంలో పశుసంవర్ధక సహాయకుడిగా విధులు నిర్వహిస్తున్న తమ్మినేని అయ్యప్ప(సంతోష్‌కుమార్) జోన్–1 నుంచి రాష్ట్రస్థాయి ఉత్తమ ఉద్యోగి అవార్డును అందుకున్నారు. బుధవారం విజయవాడలోని డైరెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో ఆ శాఖ రాష్ట్ర సంచాలకుడు డాక్టర్ డి.దామోదరనాయుడు ఈ అవార్డును అందించారు. పశుసంవర్ధక శాఖకు సంబంధించి పలు కీలక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసి, పాడి రైతులకు మేలు చేసినందుకు ఈ అవార్డును ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు.

దేశానికి మోదీనే బ్రాండ్

దేశానికి మోదీనే బ్రాండ్