
చోరీకి యత్నించిన మహిళ అరెస్టు
మెళియాపుట్టి: ఈనెల 14వ తేదీన పట్టపగలే ఒక మహిళ చోరీకి ప్రయత్నించడమే కాకుండా.. మరో మహిళపై దాడిచేసి పారిపోయిన ఘటన మండలంలోని పట్టుపురం గ్రామంలో చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అయితే మంగళవారం సాయంత్రం దాడికి పాల్పడిన మహిళను స్థానిక పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో పాతపట్నం సీఐ వి.రామారావు, ఎస్‌ఐ పి.రమేష్ బాబు మీడియాకు వివరాలు బుధవారం వెల్లడించారు. మెళియాపుట్టి మండలంలోని వసుంధర గ్రామానికి చెందిన మనుజ మల్లిక్ అనే 41 ఏళ్ల మహిళ పట్టుపురం గ్రామానికి చెందిన అంబల లచ్చయ్య ఇంట్లో ఈనెల 14వ తేదీన చొరబడింది. అదే సమయంలో లచ్చయ్య భార్య అంబలి కాంచన మెళియాపుట్టి గ్రామంలో ఉన్న సాయిబాబా ఆలయంలో సేవకు వెళ్లి కార్యక్రమం ముగించుకుని ఇంటికి వచ్చింది. ఆ సమయంలో ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో ఇంట్లోకి వెళ్లి చూసేసరికే, తలుపు చాటున గుర్తు తెలియని మహిళ (మనుజ మల్లిక్) కాంచన తలపై బలంగా కర్రచెక్కతో కొట్టి పారిపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దీనిలో భాగంగా మనుజ మల్లిక్ స్కూటీ, ఆమె వేసుకున్న బుర్ఖా, ఇతర ఆనవాళ్లు సీసీ కెమెరాలో గుర్తించారు. మంగళవారం వసుంధర చెక్‌పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో సీసీటీవీ ఫుటేజీలో గుర్తించిన ద్విచక్ర వాహనం గమనించి ఆమెను పట్టుకున్నారు. దొంగతనానికి వచ్చి, అంతలోనే ఇంటి యజమాని రావడంతో దొరికిపోతానేమోనన్న భయంతో దాడికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.
పక్కా ప్లాన్‌తోనే..
ఒడిశాలోని ఖైటడ గ్రామంలో బాధితురాలు, ముద్దాయి మునుజ పక్కపక్క ఇళ్లల్లో కొన్నేళ్లు కలిసి ఉండేవారు అదే క్రమంలో పరిచయం ఏర్పడింది. పలుమార్లు పట్టుపురం వచ్చి అంతా గమనించి దొంగతనానికి పాల్పడింది. మనుజ మల్లిక్ ప్రస్తుతం పర్లాకిమిడిలో బ్యూటీపార్లర్ నడుపుతుంది. అక్కడి ఆర్టీవో కార్యాలయం అధికారులతో చనువు పెంచుకుని పలువురికి లైసెన్సులు చేయిస్తూ ఉంటుంది. ఆమె విలాసాలకు అలవాటుపడి నేరాలకు పాల్పడుతుందని, ఆమె ఉన్న ఏరియాలోనే దొంగతనాలు జరుగుతున్నాయని, వాటి వెనుక ఈమె హస్తం ఉందని ఒడిశా పోలీసులు సైతం అనుమానిస్తున్నట్లు సమాచారం. వారు కూడా ఈమె కదలికలపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.