
బ్లాక్ మార్కెట్‌లో ఎరువులు
టెక్కలి: కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ఎరువుల వాటాలో 50 శాతం మాత్రమే తీసుకుని మిగిలినది నగదు రూపంలో కూటమి ప్రభుత్వం లాగేసుకుందని వైఎస్సార్ సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ అన్నారు. టెక్కలి వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కోటబొమ్మాళి మండలంలో మంత్రి అచ్చెన్నాయుడికి అనుకూలంగా ఉన్న బ్రోకర్ల వద్ద బ్లాక్ మార్కెట్‌లో ఎలా ఎరువులు దొరుకుతున్నాయో మంత్రి సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2018లో తిత్లీ తుఫాన్ సమయంలో రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తామని అప్పటి మంత్రి హోదాలో అచ్చెన్నాయుడు హామీ ఇచ్చినా ఇంతవరకు సాయం అందలేదన్నారు. 2019లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సీఎం అయ్యాక అప్పటి కమీషనర్ అరుణ్‌కుమార్ స్పందించి జిల్లాకు రూ.83 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చారని, అందులో ఒక్క టెక్కలి నియోజకవర్గానికే రూ.39 కోట్లు ఇచ్చారని వివరించారు. దీనిపై కనీస అవగాహన లేక టీడీపీ నాయకులు విమర్శలు చేయడం హస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టెక్కలిని జిల్లా కేంద్రంగా మారుస్తానని, రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తామని చెప్పి చివరకు రైతులే సొంత డబ్బులతో బీమా కట్టించుకునే పరిస్థితికి తీసుకువచ్చారని దుయ్యబట్టారు. కింజరాపు కుటుంబ పాలనలో టెక్కలిలో ఒక్క శాశ్వతమైన పథకం ఇచ్చారా అని తిలక్ ప్రశ్నించారు. అచ్చెన్నాయుడికి సత్తా ఉంటే ఆఫ్‌షోర్, విత్తనోత్పత్తి కేంద్రాన్ని పూర్తి చేయాలని, రైతులకు రెండో విడతగా పూర్తి స్థాయిలో ఎరువులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నందిగాం ఎంపీపీ ఎన్.శ్రీరామ్మూర్తి, సంతబొమ్మాళి జెడ్పీటీసీ పాల వసంత్ రెడ్డి, పార్టీ మండల కన్వీనర్లు హెచ్.వెంకటేశ్వరరావు, ఎస్.హేమసుందర్‌రాజు, టి.ఫాల్గుణరావు, బీసీ విభాగం ప్రధాన కార్యదర్శి జి.గురునాథ్ యాదవ్, నాయకులు కె. అజయ్‌కుమార్, కె.జీవన్, పి.వైకుంఠరావు, డి. కూర్మారావు, పేడాడ వెంకటరావు పాల్గొన్నారు.
టెక్కలి వైఎస్సార్ సీపీ సమన్వయకర్త పేరాడ తిలక్