గెలిపించిన పాపానికి బిల్లులివ్వరా..?
శ్రీకాకుళం రూరల్: ‘పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డాను. నా అనుకున్న వారికి దూరమైనా.. పార్టీ గెలుపు కోసం పనిచేశాను. ఇప్పుడు ఆ పార్టీయే నాపై కనికరం చూపించడం లేదు. చేసిన పనికి బిల్లు ఇవ్వడం లేదు’ అంటూ ఓ టీడీపీ సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం పరిధి కనుగులవానిపేట గ్రామానికి చెందిన టీడీపీ సర్పంచ్ గంగు వెంకటరావు పార్టీకి వీర విధేయుడు. ఆయన గ్రామంలో ఇటీవల ఓ సీసీ డ్రైన్‌తో పాటు దానిపై కవర్‌స్లాబ్ పనులు చేయించారు. ముందుగా పంచాయతీ తీర్మానంతో పాటు ఎస్టిమేషన్ వేశాక ఇంజినీరింగ్ అసిస్టెంట్‌తో పొడవు, వెడల్పు, మెటీరియల్‌ను లెక్కించాక పనులు ప్రారంభించారు. అంచనా విలువ రూ.4.90 లక్షలు. ఏప్రిల్ 17 నాటికి పనులు కూడా అయిపోయాయి. కానీ అప్పటి నుంచి బిల్లు రాలేదు. ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈతో ఎంబుక్‌లో నమోదు చేయించాలని చూస్తున్నా పని కావడం లేదు. మండల పరిషత్ అధికారులను కలిసినా ఫలితం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు చేసి రెండు నెలలు కావస్తోందని, ఎంబుక్‌లో కూడా నమోదు చేయలేదని దీనిపై కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తానని ఆయన చెప్పారు. దీనిపై ఎంపీడీఓ శైలజను సంప్రదించగా ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ శ్రీకాకుళం మండలానికి ఇన్‌చార్జిగా ఉన్నారని, విషయం చెబుతానని తెలిపారు.
ప్రభుత్వంపై ఓ టీడీపీ సర్పంచ్ మండిపాటు
నన్ను పట్టించుకోవడం లేదు
టీడీపీ కోసం కష్టపడినా నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు. బిల్లు కోసం అందరి అధికారుల వద్దకు తిరిగినా లాభం లేదు. ఏ ఒక్కరూ నన్ను పట్టించుకోవడం లేదు. కలెక్టర్‌ను కలిసి విషయం చెబుతాను.
– గంగు వెంకట్రావు, టీడీపీ సర్పంచ్
గెలిపించిన పాపానికి బిల్లులివ్వరా..?


