గరం గరంగా హైటీ!
● పాస్టర్ల మధ్య గొడవ పెట్టిన తొలి ఎమ్మెల్యే మీరే! ● క్రిస్మస్ హైటీలో గొండు శంకర్‌పై ఓ పాస్టర్ సంచలనం వ్యాఖ్యలు
శ్రీకాకుళం కల్చరల్: జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కళావేదికలో సోమవారం నిర్వహించిన హైటీ–2025 (క్రిస్మస్ సంబరాలు) వేడుక వివాదానికి వేదికగా మారింది. తెలుగు బాప్టిస్టు సంఘంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన విభేదాలు గందరగోళానికి దారితీశాయి. తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఓ వర్గం ప్రతినిధులు వేదిక బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ వచ్చి ఇరువర్గాలకు సర్ది చెప్పగా.. పార్టీ ప్రమేయంతో కార్యక్రమం నిర్వహించడం సరికాదని పలువురు నిలదీశారు. ‘పాస్టర్ల మధ్య గొడవ పెట్టిన తొలి ఎమ్మెల్యే మీరేనని’ ఎమ్మెల్యేని ఉద్దేశించి ఓ పాస్టర్ అనడంతో ఆయన అవాక్కయ్యారు. తమ మధ్య గొడవలు పెట్టారని పాస్టర్లంతా ఎమ్మెల్యేను తప్పుపట్టారు. వేదిక పైన తమకు స్థానం ఇవ్వకుండా చేశారని, సొంత పార్టీ వ్యక్తులే ఇలా చేయడం సరికాదని, విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతామని చెప్పారు. అనంతరం ఇరువర్గాల ప్రతినిధులను వేదికపైకి పిలవడంతో గొడవ సద్దుమణిగింది. మరోవైపు, గతంలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో జనాలు రాలేదనే ఉద్దేశంతో ఎమ్మెల్యే పిలుపు మేరకు డ్వాక్రా మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పాస్టర్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వారంతా బయకు వెళ్లిపోయారు. అంతకుముందు జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎమ్మెల్యేలు గొండు శంకర్, బగ్గు రమణమూర్తి హాజరై క్రిస్మస్ కేక్ కట్ చేశారు.


