లేకుంటే పొమ్ము!
మంత్రి అచ్చెన్న ఇలాఖాలో మిల్లర్లు చెప్పిందే వేదం దోపిడీ చేస్తున్నారని ఫిర్యాదు చేసినా మారని తీరు ఆందోళనలో రైతులు
మంత్రి కుటుంబానికి వాటాలు..
ఇష్టముంటే అమ్ము..
ధాన్యం కొనుగోలు విషయంలో టెక్కలి నియోజకవర్గంలో దళారీలు, మిల్లర్లు కలిసి రైతులకు నరకం చూపుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలో రైతులు గగ్గోలు పెడుతున్నా పట్టించుకోవడం లేదు. విత్తనాల నుంచి ధాన్యం అమ్మకాల వరకు ఇబ్బందులు పడుతున్నారు. మిల్లర్లు దోపిడీ చేస్తున్నారని మంత్రికి, కలెక్టర్‌కు చెప్పినా పరిస్థితి మారడం లేదు. రైతుల నుంచి ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు.
– సత్తారు సత్యం, వైఎస్సార్‌సీపీ
జిల్లా అధికార ప్రతినిధి, టెక్కలి
టెక్కలి:
‘సార్.. ధాన్యం పట్టుకుని మిల్లర్ వద్దకు వెళితే తేమశాతం, నూకలు, తరుగు పేరుతో ఒక్కో బస్తాకు అదనంగా 2 నుంచి 5 కిలోల ధాన్యం తీసుకుంటున్నారు. ఇదేంటని మిల్లర్‌ను ప్రశ్నిస్తే.. ఇష్టం ఉంటే ధాన్యం అమ్ము.. లేకపోతే తీసుకెళ్లిపో అంటూ కసురుకుంటున్నారు..’ అంటూ బాధిత రైతులు సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వద్ద ఇటీవల వాపోయారు. అయినప్పటికీ టెక్కలి నియోజకవర్గం పరిధిలో పలు రైస్ మిల్లుల్లో ఇప్పటికీ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ముఖ్యంగా టెక్కలి మండలంలో ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లు చెప్పిందే వేదంగా మారుతోంది. మిల్లరు ఎంత మేరకు డిమాండ్ చేస్తే అంత ధాన్యం కప్పం కట్టాల్సిన పరిస్థితి నెలకొంది. గత కొద్ది రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా అధికార యంత్రాంగం మాత్రం క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి రైతులకు మేలు కలిగే చర్యలు చేపట్టకపోవడం గమనార్హం.
నిలిచిన బ్యాంకు గ్యారెంటీలు..
టెక్కలి మండలంలో 23 రైస్ మిల్లులకు సంబంధించి మొదటి విడత, రెండో విడత బ్యాంకు గ్యారెంటీ(బీజీ)లతో ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టారు. కొద్దిరోజుల క్రితం బీజీ టార్గెట్ పూర్తవడంతో, మూడో విడత బ్యాంకు గ్యారెంటీ విషయంలో మిల్లర్లు వెనుకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం 7 రైస్ మిల్లులకు మాత్రమే బీజీలు ఉండడంతో కొనుగోలు ప్రక్రియ జరుగుతోంది. అయితే టెక్కలి మండలానికి సంబంధించి 24 వేల మెట్రిక్ టన్నుల మేరకు ధాన్యం కొనుగోలుకు లక్ష్యం కాగా ప్రస్తుతానికి 11 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, రైస్ మిల్లుల్లో మాత్రం లెక్కకు మించి ధాన్యం నిల్వలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి బీజీలు లేకపోవడంతో దళారులు, మిల్లర్లదే రాజ్యంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరుగుతోంది. మొత్తమ్మీద కల్లం నుంచి ధాన్యం బస్తాలతో బయలుదేరుతున్న రైతులు ట్రాక్టర్, లోడింగ్ చార్జీలు, పంచాయతీ ఆశీల పన్ను, వే బ్రిడ్జి, గోనె సంచులు, బస్తాలు దించేందుకు చార్జీలు, మిల్లర్ల ఇబ్బందులు కారణంగా విలవిలలాడుతున్నారు.
ధాన్యం కొనుగోలు విషయంలో టెక్కలి నియోజకవర్గంలో మిల్లర్ల నుంచి మంత్రి అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులకు కొంత వాటాలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. మంత్రి సోదరుడు హరివరప్రసాద్ నేతృత్వంలో మిల్లర్లు ఏకమై రైతుల నుంచి దోపిడీ చేస్తున్నారు. అందుకే మిల్లర్లు ఏం చెప్పినా.. ఏం చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. వ్యవసాయ శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు పూర్తిగా విఫలమయ్యారు.
– పేరాడ తిలక్,
వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, టెక్కలి
లేకుంటే పొమ్ము!
లేకుంటే పొమ్ము!


