సీఎం మెప్పు కోసం సీఐటీయూను విమర్శిస్తారా?
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): సీఎం చంద్రబాబునాయుడు వద్ద గొప్పలు, మెప్పు కోసం ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు సీఐటీయూపై అక్కసు వెళ్లగక్కడం సరికాదని సీఐటీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సీహెచ్.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు కె.నాగమణి మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ కార్మిక సంఘాలను, సీఐటీయూను కంట్రోల్ చేస్తున్నానని సీఎం ముందు ఎన్‌ఈఆర్ ప్రసంగించారని, కార్మికోద్యమాలను అడ్డుకోవడం ఎవరి తరం కాదని స్పష్టం చేశారు. ఇటువంటి ప్రగల్భాలు పలికిన వారు అనేకమంది కాలగర్భంలో కలిసిపోయారని గుర్తు చేశారు. జిల్లాలో ట్రేడ్ యూనియన్లు చేసిన పోరాటాల ఫలితం ఏ పరిశ్రమ కుంటుపడలేదని, ప్రభుత్వ విధానాల వల్లేనని తెలుసుకోవాలన్నారు. సీఐటీయూ నాయకులు ఎవరూ పరిశ్రమల్లో కాంట్రాక్టులు తీసుకోవడం లేదని, యాజమాన్యాలకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేసి, యాజమాన్యాలను బెదిరించి కాంట్రాక్టులు తీసుకుంటున్న వారెవరో ప్రజలకు తెలుసునన్నారు. పారిశ్రామిక ప్రాంతంలో అనేక పరిశ్రమల్లో కార్మికులు గాయపడుతున్నా, చనిపోతున్నా యాజమాన్యాలపై నోరెత్తని ఎమ్మెల్యే.. కార్మికుల సమస్యలపై పోరాటాలు చేసే సీఐటీయూపై అనుచితంగా మాట్లాడటం శోచనీయమన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో కార్మికుల ఓట్లతో గెలిచి కార్మిక వ్యతిరేక వైఖరిని అవలంబించడం తగదన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులు కాలరాస్తోందని దుయ్యబట్టారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎం.ఆదినారాయణమూర్తి, ఎన్.వి.రమణ, అల్లు.సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఎంఎల్‌హెచ్‌ఓల సమ్మెబాట
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వం మిడ్ లెవెల్ హెల్త్ ఆఫీసర్ల(ఎంఎల్‌హెచ్‌ఓ)ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఇప్నటికే పలుమార్లు వినతిపత్రాలు, నిరసనల ద్వారా తెలియజేసినా పరిష్కరించకపోవడంతో ఈ నెల 28 నుంచి సమ్మెబాట పడుతున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమీపంలోని జ్యోతీరావు పూలే పార్కులో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నెల 15 నుంచి చేస్తున్న నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా ప్రభుత్వం స్పందించకపోతో ఏప్రిల్ 28 నుంచి నిరవదిక సమ్మె చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు నిరంజన్, ప్రధాన కార్యదర్శి బి.సందీప్‌కుమార్, వినోద్‌కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం మెప్పు కోసం సీఐటీయూను విమర్శిస్తారా?


