పండుటాకులపై ప్రతాపమా..? | - | Sakshi
Sakshi News home page

పండుటాకులపై ప్రతాపమా..?

Apr 3 2025 2:44 PM | Updated on Apr 3 2025 2:44 PM

పండుటాకులపై ప్రతాపమా..?

పండుటాకులపై ప్రతాపమా..?

● రెండు నెలలుగా 8 మంది వృద్ధులకు అందని పింఛన్లు ● ఇన్‌చార్జి ఎంపీడీవోను నిలదీసిన వైఎస్సార్‌సీపీ నేతలు

టెక్కలి: కోటబొమ్మాళి మండలం కమలనాభపురం గ్రామంలో దువ్వారపు అప్పన్న, కర్రి లక్ష్మణ, రోణంకి సింహాచలం, గురువెల్లి గోపాలరావు, కూన సుగ్రీవులు, మొజ్జాడ సూర్యనారాయణ, బొడ్డేపల్లి ధర్మారావు, నెయ్యిల లక్ష్మీనారాయణలకు వృద్ధాప్య పింఛన్లు రెండు నెలలుగా అధికారులు అందజేయడం లేదు. దీంతో గ్రామ సర్పంచ్‌ సంపతిరావు ధనలక్ష్మి, నాయకులు అన్నెపు రామారావు, ఎస్‌.హేమసుందర్‌రాజు, కె.సంజీవరావు, దుక్క రామకృష్ణారెడ్డి, ఎస్‌.జనార్ధన్‌రెడ్డి, బి.వెంకటరమణ, జి.సోమేష్‌, శివారెడ్డి, ఎస్‌.నారాయణరాజు తదితరులు బాధిత పింఛనుదారులతో కలిసి బుధవారం కోటబొమ్మాళి ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఇన్‌చార్జి ఎంపీడీవో జయంత్‌ప్రసాద్‌ను నిలదీశారు. నిన్నటివరకు విధుల్లో ఉన్న ఎంపీడీవో ఫణీంద్రకుమార్‌ ఆదేశాలతో పంచాయతీ కార్యదర్శి రమేష్‌ గత నెలలో పింఛన్లు ఆపివేశారని తెలిపారు. దీనిపై అప్పుడు అడిగితే ఏప్రిల్‌ నెలలో పింఛన్లు ఇస్తామని చెప్పారని గ్రామ సర్పంచ్‌ ధనలక్ష్మి గుర్తు చేశారు. అయితే ఈనెల 1వ తేదీన గ్రామంలో చేపట్టిన పింఛన్ల పంపిణీలో మరలా 8 మంది వృద్ధులకు పింఛన్లు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్నటివరకు విధుల్లో ఉన్న ఎంపీడీవో ఫణీంద్రకుమార్‌ను ఈ విషయంపై సంప్రదిస్తే 2వ తేదీన పింఛన్లు ఇచ్చేస్తామని చెప్పారన్నారు. కానీ ఇప్పుడు ఆయన సెలవు పెట్టి వెళ్లిపోయారని అదే గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు హేమసుందర్‌రాజు మండిపడ్డారు.

ఏమని దర్యాప్తు చేస్తారు..?

అయితే నిలిపివేసిన పింఛన్లపై దర్యాప్తు చేస్తామని ఇన్‌చార్జి ఎంపీడీవో జయంత్‌ప్రసాద్‌ చెప్పగా, డీఆర్‌డీఏ నుంచి కాకుండా స్థానికంగా కక్ష సాధింపులో భాగంగా పింఛన్లు ఆపేస్తే ఏమని దర్యాప్తు చేస్తారని వైఎస్సార్‌సీపీ నాయకులు మండిపడ్డారు. నిరుపేద వర్గాలకు చెందిన వృద్ధుల పింఛన్లను రెండు నెలలుగా ఆపివేసి ఇప్పుడు కథలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ కార్యకర్తలు చెబితేనే పింఛన్లు ఆపివేశామని కాగితంపై రాసిచ్చేయండి అంటూ వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు అన్నెపు రామారావు దుయ్యబట్టారు. అయితే సాయంత్రంలోగా పింఛన్లు ఇచ్చేస్తామంటూ సెలవుపై వెళ్లిన ఎంపీడీవో ఫణీంద్రకుమార్‌ ఫోన్‌లో సమాధానం చెప్పాడు. తీరా సాయంత్రానికి అతను ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోవడమే కాకుండా, పంచాయతీ కార్యదర్శి రమేష్‌ సైతం ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేశాడని నాయకులు వెల్లడించారు. బాధిత పింఛన్‌దారులకు పింఛన్‌ డబ్బులు ఇచ్చేవరకు న్యాయ పోరాటం చేస్తామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement