సాక్షి, పుట్టపర్తి
తొలివిడత ‘పల్లె పోరు’కు సర్వం సిద్ధమైంది. ధర్మవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఏడు మండలాల పరిధిలోని 112 సర్పంచ్ స్థానాలకు, 874 వార్డు స్థానాలకు గురువారం ఎన్నికలు జరగనుండగా.. అధికారులు, సిబ్బంది ఇప్పటికే సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. అనంతరం ఫలితాలు వెల్లడిస్తారు. ఈ మేరకు ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఏడు మండలాల్లో ఎన్నికలు..
ధర్మవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని ముదిగుబ్బ, తాడిమర్రి, బత్తలపల్లి, ధర్మవరం, చెన్నేకొత్తపల్లి, రామగిరి, కనగానపల్లి మండలాల్లో తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఆయా మండలాల్లోని 114 సర్పంచ్ స్థానాలు, 1,156 వార్డులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. కూటమి నేతల కుట్రల్లో భాగంగా రెండు సర్పంచ్ స్థానాలు (రామగిరి మండలం నసనకోట, కనగానపల్లి మండలం ముక్తాపురం), 282 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 112 సర్పంచ్ స్థానాలకు 320 మంది పోటీలో ఉన్నారు. అదేవిధంగా 874 వార్డు స్థానాలకు 1,818 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
భయం గుప్పిట్లో రామగిరి, కనగానపల్లి..
రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని రామగిరి, కనగానపల్లి మండలాల్లో ఓటర్లు భయం భయంగా గడుపుతున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సమయంలో నామినేషన్ రోజు నుంచి టీడీపీ గూండాలు దాడులకు తెగబడ్డారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో బాధితులపైనే అక్రమంగా కేసులు నమోదు చేశారు. ఈనేపథ్యంలో పోలీసు వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లడంతో ఓటింగ్‌కు వెళ్లేందుకు సామాన్య ప్రజలు జంకుతున్నారు.
ప్రత్యేక బలగాల కోసం
వైఎస్సార్‌సీపీ వినతి..
పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ సమయంలోనే నసనకోటలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారున్ని కూటమి నేతలు కిడ్నాప్ చేయబోయారు. ఆ తర్వాత ఎలాంటి కారణం చూపకుండానే అతని నామినేషన్ తిరస్కరించారు. ఇక గతేడాది ఎంపీపీ ఉప ఎన్నిక సమయంలోనే కురుబ లింగమయ్యను టీడీపీ గూండాలు హత్య చేసిన ఉదంతం ప్రజల కళ్లల్లోనే తిరుగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద రచ్చ చేసి వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బయటకు పంపించి రిగ్గింగ్ చేసుకునే ప్లాన్‌లో కూటమి నేతలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలంటే తప్పనిసరిగా ప్రత్యేక బలగాలు ఉండాలని వైఎస్సార్‌సీపీ భావిస్తోంది. ప్రత్యేక బలగాలతో అభ్యర్థులకు, ఓటర్లకు భద్రత కల్పించాలని వైఎస్సార్‌సీపీ నాయకులు ఇప్పటికే కలెక్టర్‌తో పాటు ఎస్పీకి వినతిపత్రాలు అందజేశారు.
తొలివిడత పంచాయతీ పోలింగ్‌కు సర్వం సిద్ధం
ఉదయం 7 గంటల నుంచి
ఓటింగ్ ప్రారంభం
మధ్యాహ్నం 2 తర్వాత ఓట్ల లెక్కింపు..
ఆ వెంటనే ఫలితం
పోలింగ్ కేంద్రాలకు తరలిన సిబ్బంది, అధికారులు
రాప్తాడు, ధర్మవరం పరిధిలో
పటిష్ట బందోబస్తు
రిగ్గింగ్ చేసే ఆలోచనలో
కూటమి పార్టీల నాయకులు
ప్రత్యేక బలగాలు పంపాలని కోరిన
వైఎస్సార్‌సీపీ నేతలు
‘వైఎస్సార్‌సీపీ’ టార్గెట్‌గా..
పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ప్రజల్లో ఆదరణ వస్తుండటంతో కూటమి నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో సజావుగా పోలింగ్ జరిగితే వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు గెలుస్తారనే ఉద్దేశంతో దౌర్జన్యాలకు దిగేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సమయంలో నామినేషన్ల ప్రక్రియ నుంచి ఓట్ల లెక్కింపు వరకు దాడులు, దౌర్జన్యాలతో రెచ్చిపోయిన కూటమి గూండాలు...పంచాయతీ ఎన్నికల్లోనూ అదే దారిలో వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకోసం మిగతా ప్రాంతాల నుంచి గూండాలను రప్పించినట్లు సమాచారం. ఎలాగైనా సరే వైఎస్సార్‌సీపీ నాయకులను భయభ్రాంతులకు గురి చేసి పోలింగ్ కేంద్రాలకు రానీయకుండా రిగ్గింగ్ చేసుకోవాలనే ప్లాన్‌లో ఉన్నట్లు సమాచారం.


