పుట్టపర్తి అర్బన్: తుపాను ప్రభావంతో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకూ జిల్లాలోని 15 మండలాల పరిధిలో వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా ఓడీచెరువు మండలంలో 15.4 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక రొళ్లలో 14.6, నల్లచెరువు 12.4, మడకశిర 12.2, తనకల్లు 11.6, రొద్దం 8.2, గోరంట్ల 8.2, గాండ్లపెంట 7.4, అమడగూరు 7.2, పెనుకొండ 4.4, హిందూపురం 3.2, సోమందేపల్లి 3.0, చిలమత్తూరు 2.2, లేపాక్షి 1.8, పుట్టపర్తి మండలంలో 0.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మరో రెండు రోజులు తుపాను ప్రభావంతో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని తెలిపారు.
భూగర్భ జలాల పెంపే లక్ష్యం: కలెక్టర్
పుట్టపర్తి అర్బన్: భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా నీటి పారుదల శాఖ, డ్వామా నిరంతరం పని చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. బుధవారం ఆయన ఆయా శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పనుల ప్రణాళికను రెండు రోజుల్లో పూర్తి చేయాలని, పనుల పురోగతిని ప్రతివారం సమీక్షించాలన్నారు. జిల్లాలోని అన్ని చెరువులు, కాలువలు, కుంటల మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. ఉపాధి హామీ పథకంలో కింద పెద్ద ఎత్తున పనులు చేయించాలన్నారు. అలాగే జలహారతి 2.0 కింద జల సంరక్షణ పనులన్నింటినీ శరవేగంగా పూర్తి చేయాలన్నారు. భూగర్భ జలాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్, డ్వామా, శాఖల అధికారులు పాల్గొన్నారు.
28న బుక్కపట్నంలో జాబ్ మేళా..
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 28న బుక్కపట్నంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బుక్కపట్నంలోని శ్రీసత్యసాయి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 28 ఉదయం 9 గంటల నుంచి మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జాబ్‌మేళాలో ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. ఆసక్తి కలిగిన వారు https://naipunyam. ap.gov.in వెబ్‌సైట్‌లో పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. అలాగే జాబ్‌మేళాకు వచ్చేటప్పుడు ఆధార్, ఫొటోలతో పాటు చదువు, ఆదాయం, కుల ధ్రువీకరణ పత్రాలన్నీ తీసుకురావాలన్నారు. మరిన్ని వివరాలకు 7981541994 నంబరులో సంప్రదించాలని సూచించారు.


