అనంతపురం ఎడ్యుకేషన్: ‘ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తున్నాం’ అని ఉన్నతాధికారులు చెబుతున్న మాటలు నీటి మీద రాతలుగానే కనిపిస్తున్నాయి. అనంతపురం రూరల్ మండలం రాచానపల్లిలో గురువారం జరగనున్న పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను చూస్తే అవునని చెప్పకతప్పదు. ప్రతి పోలింగ్ బూత్‌లోనూ సీసీ కెమెరాలు లేదా వీడియో రికార్డింగ్ ద్వారా పర్యవేక్షించాలని ఎన్నికల సంఘం ఆదేశించినప్పటికీ, ఇక్కడ మాత్రం కొన్ని బూత్‌లకే కెమెరాలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. మొత్తం 14 బూత్‌లు ఏర్పాటు చేయగా, కేవలం ఆరింటికే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, మిగిలిన బూత్‌లలో పరిస్థితిపై అనుమానాలు రేకెత్తిస్తోంది. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఈ ఏర్పాట్లపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
14 పోలింగ్ బూత్‌లు
రాచానపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో నాలుగు, ఉన్నత పాఠశాలలో పది బూత్‌లు కలిపి మొత్తం 14 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. అయితే ప్రాథమిక పాఠశాలలో రెండు, ఉన్నత పాఠశాలలో నాలుగు బూత్‌లకు మాత్రమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మిగిలిన ఎనిమిది బూత్‌లకు కెమెరాలు లేకపోవడంపై అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని బుధవారం సాయంత్రం స్టేజ్–2 అధికారి దృష్టికి తీసుకెళ్లగా, తమకు సంబంధం లేదని, ఏదైనా ఉంటే రిటర్నింగ్ అధికారితో మాట్లాడుకోవాలని చెప్పినట్లు బాధిత అభ్యర్థులు వాపోతున్నారు.
కౌంటింగ్ హాలులో చార్జింగ్ లైటు మాయం
ఉన్నత పాఠశాలలోనే ఓట్ల లెక్కింపు జరగనుండగా, అక్కడి సమావేశ మందిరంలో పంచాయతీ అధికారులు గతంలోనే చార్జింగ్ లైటును ఏర్పాటు చేశారు. అయితే బుధవారం ఆ లైటును అక్కడి నుంచి తొలగించడం పలు అనుమానాలకు తావిస్తోంది. కౌంటింగ్ హాలులో తగిన వెలుతురు ఉండేలా అదనపు లైట్లు ఏర్పాటు చేయాల్సింది పోయి, ఉన్న సౌకర్యాన్ని తొలగించడం వెనుక కారణాలేమిటో అధికారులే చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఓటు రహస్యానికి ముప్పు?
ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన నాలుగో నంబరు బూత్ పరిస్థితి కూడా అభ్యంతరాలకు కారణమవుతోంది. వరండాలో తడికలు ఏర్పాటు చేసి చిన్న, ఇరుకై న గదిలో పోలింగ్ కేంద్రాన్ని సిద్ధం చేయడంపై అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ సిబ్బంది, ఏజెంట్లు లోపల కూర్చుంటే ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉందని చెబుతున్నారు. అంతేకాకుండా ఓటరు తన ఓటును రహస్యంగా వినియోగించుకునే అవకాశం దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బూత్ ఏర్పాట్ల సమయంలో కొందరు అభ్యంతరం వ్యక్తం చేసినా పంచాయతీ సిబ్బంది పట్టించుకోలేదంటున్నారు.
ఎంపీడీఓ హామీ.. లోపాలు సరిచేస్తారా?
ఈ వ్యవహారంపై ఎంపీడీఓ దివాకర్ స్పందిస్తూ.. సిండికేట్‌నగర్ బూత్‌ల వద్దకు నలుగురు వీడియో గ్రాఫర్లను పంపిస్తున్నామని పేర్కొన్నారు. పోలింగ్ ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా రికార్డు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తడికలతో చిన్నగా ఏర్పాటు చేసిన నాలుగో నంబరు బూత్ విషయాన్ని మరోసారి పంచాయతీ కార్యదర్శితో మాట్లాడి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
రాచానపల్లిలోని పోలింగ్ కేంద్రాల్లో అరకొరగా సీసీ కెమెరాల ఏర్పాటు
కౌంటింగ్ హాలులో చార్జింగ్ లైటు తొలగింపు
ఎన్నికల ఏర్పాట్లపై అభ్యర్థుల్లో అనుమానాలు


