ధర్మవరం అర్బన్: పట్టణంలోని ధరణి బియ్యం కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తనిఖీ చేశారు. పట్టణంలో ఏర్పాటు చేసిన ధరణి బియ్యం కేంద్రాన్ని బుధవారం సాయంత్రం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. హోల్‌సేల్ వ్యాపార కేంద్రాలను పరిశీలించారు. సరుకుల నిల్వలు, రికార్డుల నిర్వహణ, నాణ్యత ప్రమాణాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రతి హోల్‌సేల్, రిటైల్ దుకాణం ముందు వినియోగదారులకు స్పష్టంగా కనిపించేలా ధరల పట్టికను తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు. నిల్వల వివరాలను ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. ధరల పట్టిక, స్టాక్ వివరాలు ప్రదర్శించకపోయినా, అక్రమ నిల్వలకు పాల్పడినా సంబంధిత వ్యాపారులపై చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తనిఖీల్లో ఆర్డీఓ రామభూపాల్‌రెడ్డి, డీఎస్‌ఓ వంశీకృష్ణరెడ్డి, తహసీల్దార్ దేవరాజ్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
జాతీయస్థాయి క్యాంపునకు పెనుకొండ విద్యార్థిని
పెనుకొండ రూరల్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థికి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. కళాశాలలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న యాసిక ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్‌గా ఉత్తమ ప్రతిభ కనబరిచింది. దీంతో డిసెంబర్ 1 నుంచి 10వ తేదీ వరకు హిమాచల్‌ప్రదేశ్‌లోని అటల్ బిహరీ వాజ్‌పేయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ అండ్ అలైడ్ స్పోర్ట్స్ కేంద్రంలో జరిగే అడ్వెంచర్ క్యాంపునకు ఎంపికై నట్లు కాలేజీ ప్రిన్సిపాల్ నాగ శశికళ తెలిపారు. ఎన్‌ఎస్‌ఎస్ అధికారి ప్రతాప్, కళాశాల అధ్యాపకులు విద్యార్థిని యాసికను అభినందించారు.
దేశాభివృద్ధిలో భాగస్వాములవుదాం
● ఎస్కేయూ రెక్టార్ ఆచార్య అనిత
అనంతపురం: రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవిస్తూ దేశాభివృద్ధిలో భాగస్వాములవుదామని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం రెక్టార్ ఆచార్య అనిత పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్కేయూలోని మహాత్మా జ్యోతిరావు పూలే భవన్‌లో బుధవారం కార్యక్రమం నిర్వహించారు. క్యాంపస్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ సి.హెచ్.నాగరాజు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ ఈ. రమేష్‌బాబు, న్యాయశాస్త్ర విశ్రాంత ఆచార్యులు ప్రొఫెసర్ ఈ. విజయకుమార్, ప్రొఫెసర్ జి. వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ పోటీల్లో విజేతలకు హ్యూమన్ రైట్స్ ఫోరం ప్రతినిధులు బహుమతులు అందజేశారు.
రాచానపల్లి
వార్డు అభ్యర్థికి గాయాలు
రాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ మండలం రాచానపల్లి గ్రామ పంచాయతీ 13వ వార్డు అభ్యర్థి పోసా తిరుపాలు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. బుధవారం రాత్రి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా సిండికేట్‌నగర్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం లైటింగ్ కారణంగా రహదారి సరిగా కనిపించక పోసా తిరుపాలు తన బైక్‌పై అదుపుతప్పి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో ఆయన కాలికి గాయమైంది. వెంటనే స్థానికులు స్పందించి ఆయన్ను నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మాజీ సర్పంచ్, ప్రస్తుత సర్పంచ్ అభ్యర్థి అంజి యాదవ్ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాచానపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులకు ఫోన్ చేసి పోసా తిరుపాలు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.


