అనంతపురం కల్చరల్: వారసత్వ స్ఫూర్తిని కొనసాగిద్దామని అసిస్టెంట్ కలెక్టర్ సూయస్‌కుమార్ అన్నారు. ప్రపంచ వారసత్వ వారోత్సవాల ముగింపు వేడుకలు బుధవారం జిల్లా కల్లూరు సుబ్బారావు పురావస్తు ప్రదర్శనశాలలో నిర్వహించారు. పురావస్తుశాఖ, ఇంటాక్, లేడీస్‌క్లబ్, ఇన్నర్‌వీల్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సూయస్‌కుమార్ హాజరై మాట్లాడారు. వారం రోజులుగా వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన కవులు, రచయితలను సన్మానించారు.
యువకుడి ఆత్మహత్య
పెద్దవడుగూరు: మండల పరిధిలోని కొండూరుకు చెందిన రవి (28) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలమేరకు... మృతుడు రవికి ఏడేళ్ల క్రితం గార్లదిన్నె మండలానికి చెందిన ఆమనితో వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలున్నారు. అయితే రెండేళ్లుగా రవి తాగుడుకు అలవాటు పడ్డాడు. తరచూ పూనకం వచ్చినట్లుగా వ్యవహరించే వాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 23న భార్య పుట్టింటికి వెళ్లడంతో అతనే పామిడికి వెళ్లి ఆటోలో భార్య, పిల్లలను ఎక్కించి వచ్చాడు. 24న రాత్రి రవి మద్యం సేవించి వాళ్ల అమ్మ ఇంటికెళ్లి భోజనం చేశాడు. అనంతరం అతని పెద్దనాన్న కుమారుడు శేఖర్ ఇంటి వద్దకు వెళ్లి కొద్ది సేపు మాట్లాడాడు. తర్వాత రాత్రి 12 గంటల ప్రాంతంలో నివాసం ఉంటున్న ఇంటికెళ్లి తాను చనిపోతున్నాను అని చెప్పి శేఖర్‌కు ఫోన్ చేయగా కుటుంబ సభ్యులు అందరూ కలిసి అతని ఇంటికి వెళ్లేలోపే ఉరివేసుకొని చనిపోయాడు. భార్య ఆమని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాఘవేంద్రప్ప తెలిపారు.
రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు ఎంపిక
ధర్మవరం అర్బన్: రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీల్లోనూ క్రీడాకారులు సత్తాచాటాలని ఉమ్మడి అనంతపురం జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ అసోసియేట్ కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి ఆకాంక్షించారు. పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలోని బాస్కెట్‌బాల్ కోర్టులో బుధవారం బాస్కెట్‌బాల్ రాష్ట్రస్థాయి పోటీలకు వెళుతున్న క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం పట్టణంలో ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు జరిగే రాష్ట్రస్థాయి 12వ సీనియర్ ఇంటర్ డిస్టిక్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలు జరుగుతాయన్నారు. ఇందులో పాల్గొనే ఉమ్మడి అనంతపురం జిల్లా బాస్కెట్‌బాల్ బాల బాలికల జట్లలో బాలికల విభాగంలో ధర్మవరం పట్టణానికి చెందిన బాలికలు నిక్యశ్రీ, యశస్విని, అలేఖ్య, వైష్ణవి, బాలుర విభాగంలో వీర సంజయ్‌కుమార్‌రెడ్డి, లక్ష్మీ నరసింహలు మొత్తం ఆరుగురు క్రీడాకారులు ఆయా జట్ల తరఫున పోటీపడనున్నారని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయిలో జరిగే పోటీల్లో కూడా రాణించి ధర్మవరానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మాంబ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మేడాపురం రామిరెడ్డి, కార్యదర్శి వాయల్పాడు హిదయ్‌తుల్లా పాల్గొన్నారు.


