అర్ధాకలితో విధులెలా? | - | Sakshi
Sakshi News home page

అర్ధాకలితో విధులెలా?

Nov 26 2026 1:47 AM | Updated on Nov 26 2026 1:47 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయులకు కనీస భోజన సదుపాయాలు కల్పించడంలోనూ అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఎన్నికల విధులు నిర్వహించేందుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రమించే సిబ్బందికి కడుపునిండా భోజనం పెట్టలేని దుస్థితి నెలకొంది. అనంతపురం రూరల్‌ మండలానికి సంబంధించి స్థానిక జేఎన్‌టీయూలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ సామగ్రి డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రంలో బుధవారం సిబ్బందికి అందించిన భోజనంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ప్రారంభంలో కేవలం 50–60 మందికి మాత్రమే కలర్‌ రైస్‌తో పాటు వంకాయ కూర వడ్డించగా, ఆ తర్వాత కూర అయిపోవడంతో మిగిలిన వారికి కూరలేకుండానే అన్నం పెట్టినట్లు ఉద్యోగులు వాపోయారు. దీంతో పలువురు ఉపాధ్యాయులు అధికారులను నిలదీశారు.

కూర లేని అన్నం.. రుచిలేని పెరుగన్నం

భోజన ఏర్పాట్లపై ఎన్నికల విధుల్లోని ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కలర్‌ రైస్‌ పెట్టినా అందులో కనీసం కూర లేకపోవడంతో ఎలా తినాలని ప్రశ్నించారు. పెరుగన్నం కూడా నాణ్యతగా లేదని, నీళ్లు ఎక్కువగా ఉండి రుచీపచీ లేకుండా వడ్డించారని ఆవేదన వ్యక్తం చేశారు. షుగర్‌ వ్యాధితో పాటు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఉద్యోగులు సమయానికి భోజనం చేయాల్సి ఉంటుందని, అలాంటి వారికి కనీస సదుపాయాలు కల్పించకపోవడం ఏమిటని మండిపడ్డారు. కొందరు విధిలేక పెరుగన్నం తిని వెళ్లగా, మరికొందరికి అదీ అందలేదని వాపోయారు.

పరిషత్‌ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి

ఇటీవల జరిగిన మున్సిపల్‌, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ సమయంలోనూ సిబ్బందికి నాణ్యమైన భోజనం అందించలేదు. రెమ్యూనరేషన్‌ చెల్లింపుల్లోనూ కోతలు విధించారు. అప్పట్లో కొందరు ఉద్యోగులు ఈ విషయాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ అవే పరిస్థితులు నెలకొనడంపై ఉపాధ్యాయ వర్గాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి.

రూ.500 ఖర్చు చేస్తున్నా..

ఒక్కో ఉద్యోగికి రోజుకు భోజన వసతి కోసం రూ.500 ఖర్చు చేస్తున్నప్పుడు కనీసం తృప్తిగా భోజనం పెట్టలేరా? అంటూ పలువురు సిబ్బంది అధికారులను నిలదీశారు. ఎన్నికల విధుల కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగులకు ఇలాంటి భోజన వసతులు కల్పించడం ఏమిటని ప్రశ్నించారు. మరోవైపు ఎన్నికల సామగ్రిని వెంటనే తీసుకెళ్లాలంటూ అధికారులు ఒత్తిడి చేయడంతో చాలామంది ఉద్యోగులు భోజనం చేయకుండానే మెటీరియల్‌ను తీసుకుని తమకు కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు బయలుదేరి వెళ్లారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి కనీస భోజన సదుపాయాలు కల్పించడం అధికారుల బాధ్యత కాదా అని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో కీలకంగా వ్యవహరించే సిబ్బందికే ఇలాంటి పరిస్థితులు ఎదురైతే విధులు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. కనీసం ఇప్పటికై నా జిల్లా ఎన్నికల అధికారి వెంటనే స్పందించి జేఎన్‌టీయూ డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రంలో భోజన ఏర్పాట్లపై విచారణ జరిపించాలని కోరుతున్నారు.

ఆత్మకూరులోనూ అంతే...

ఆత్మకూరు: మండలంలో 17 పంచాయతీల్లో మొత్తం 42 సర్పంచ్‌ స్థానాలకు 313 వార్డు మెంబర్లకు ఎన్నికలను నిర్వహించనున్నారు. మొత్తం 161 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు . ఒక్కో పొలింగ్‌ కేంద్రానికి సంబంధించి ముగ్గురు సిబ్బందిని కేటాయించారు. అలా 161 కేంద్రాల్లో 480 మంది అధికారులతో పాటు పంచాయితీ అధికారులు, పోలీసులు ఇలా మొత్తం 800 మంది పైన అధికారులు ఎన్నికల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంది. ఇందులో భాగంగానే ఆత్మకూరులో ఎన్నికల సామగ్రిని తీసుకోవడానికి వచ్చిన అధికారులకు, ఉపాధ్యాయులకు భోజనం కూడా సరిగ్గా దొరక్క అవస్థలు పడ్డారు. క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో గంట సేపు వేచి చూడాల్సిన దుస్థితి నెలకొంది. ఆఖరిగా ఉన్న చాలా మంది అధికారులకు తినడానికి అన్నంలోకి పప్పు లేకపోవడంతో బయట అంగళ్లలో పెరుగు ప్యాకెట్లు కోనుగోలు చేసి కడుపు నింపుకోవాల్సి వచ్చింది.

రూ.500 భోజన ఖర్చు.. కంచంలో మాత్రం కూర కరువు

భోజన వసతులపై

ఎన్నికల సిబ్బంది ఆగ్రహం

కొద్ది మందికే వంకాయ కూర .. మిగిలిన వారికి ఉత్తన్నమే గతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement