ఓటరు మహాశయా.. ఊరికి రావయ్యా | - | Sakshi
Sakshi News home page

ఓటరు మహాశయా.. ఊరికి రావయ్యా

Nov 26 2026 1:53 AM | Updated on Nov 26 2026 1:53 AM

అగళి: పంచాయతీ ఎన్నికల పోరుతో పల్లెలు వేడెక్కాయి. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన సర్పంచ్‌, వార్డు అభ్యర్థులు ప్రతి ఓటునూ అత్యంత కీలకంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇతర ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లకు ఫోన్‌ చేసి మరీ పోలింగ్‌ రోజు ఊరికి రావాలని కోరుతున్నారు.

గెలుపోటములు వారి చేతుల్లోనే...

మడకశిర, హిందూపురం, పెనుకొండ, పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాలు కర్ణాటక రాష్ట్రానికి ఆనుకుని ఉండటంతో ఇక్కడి ప్రజలు అనేకమంది ఉద్యోగ, ఉపాధి, వ్యాపారాల నిమిత్తం బెంగళూరు, తుమకూరు, శిర, పావగడ తదితర ప్రాంతాల్లో ఉంటున్నారు. మరీ ముఖ్యంగా మడకశిర నియోజకవర్గం నుంచి పెద్దఎత్తున కర్ణాటకకు వలస వెళ్లారు. వీరు బెంగళూరు, తుమకూరు నగరాలతో పాటు సరిహద్దున ఉన్న కర్ణాటక పట్టణాల్లో స్థిరపడ్డారు. ఇలాంటి వారికి ఇప్పటికీ సొంతూళ్లలోనే ఓట్లు ఉన్నాయి. వీరి ఓట్లే అభ్యర్థుల గెలుపోటములను శాసించే పరిస్థితి ఉండటంతో అభ్యర్థులు వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎక్కడెక్కడో నివసిస్తున్న వారందరినీ స్వగ్రామాలకు రప్పించి ఓటు వేయించేందుకు నానా తంటాలు పడుతున్నారు. అభ్యర్థులే నేరుగా ఫోన్ల ద్వారా వారిని సంప్రదిస్తున్నారు. మరికొందరు అభ్యర్థులు స్వయంగా ఆయా ప్రాంతాలకు వెళ్లి తమ గ్రామస్తులను పలకరించి, ఎన్నికల తేదీని గుర్తు చేస్తూ తప్పనిసరిగా ఊరికి రావాలని కోరుతున్నారు. కుటుంబ సభ్యులు బంధువులు,స్నేహితుల ద్వారా కూడా రాయబారాలు నడుపుతున్నారు.

వలస ఓటర్లకే అధిక ప్రాధాన్యం

స్థానికంగా ఉన్న ఓటర్ల కంటే ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లిన వారిపైనే అభ్యర్థులు ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. గ్రామంలో ఉన్న ఓటరు ఎటువైపో ఇప్పటికే ఓ అంచనాకు వచ్చిన అభ్యర్థులు దూరప్రాంతాల్లో ఉంటున్న వారిని ఊరికి రప్పించి తమకు ఓటు వేసేలా ప్లాన్‌ చేశారు.

ప్రత్యేక వాహనాల ఏర్పాటు..

దూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను రప్పించేందుకు అభ్యర్థులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వారి ప్రయాణానికి అనువుగా ఉండేలా ప్రైవేటు బస్సులు, మినీ వ్యాన్లు, కార్లను బుక్‌ చేస్తున్నారు. ఓటు వేసేందుకు గ్రామానికి వచ్చి, తిరిగి వెళ్లేందుకు వీలుగా రానుపోను ఏర్పాట్లు చేశారు. మరీ ఎక్కువ సంఖ్యలో ఓటర్లు ఉంటే ప్రత్యేకంగా కార్లు పంపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఒకరిద్దరు ఉంటే ప్రయాణఖర్చులు ముందుగానే ఫోన్‌పే ద్వారా పంపి ఊర్లకు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.

పంచాయతీ ఎన్నికల వేళ

వలసదారులకు పలకరింపు

ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లకు

అభ్యర్థుల ఆహ్వానాలు

కుటుంబ సభ్యులు, బంధువుల

ద్వారా రాయబారాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement