సాక్షి, పుట్టపర్తి
పరిషత్ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ నుంచి ప్రమాణ స్వీకారం వరకు ప్రతి చోట దౌర్జన్యమే గెలిచింది. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కూటమి నేతలు వ్యవహరించారు. అధికార దర్పంతోనే పదవులు చేజిక్కించుకున్నారు. సజావుగా ఎన్నిక జరిగితే గెలవడం కష్టమని భావించి దొడ్డి దారిన కుర్చీ ఎక్కారు. జిల్లాలో మూడు మండలాల పరిషత్ పీఠాలను వైఎస్సార్‌సీపీ కై వసం చేసుకుంది. మరోమూడు మండలాల్లోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకే అనుకూలంగా ఉన్నప్పటికీ కూటమి నేతలు దౌర్జన్యంగా ఎంపీపీ పీఠాలు లాక్కున్నారు.
హౌస్ అరెస్టులు..అడ్డగోలు వ్యవహారాలు..
ఎంపీపీ ఎన్నిక సందర్భంగా గురువారం పోలీసులు హౌస్ అరెస్టులతో వైఎస్సార్‌సీపీ నేతలను కట్టడి చేయగా... కూటమి పార్టీల నాయకులు అడ్డగోలుగా వ్యవహరించారు. కదిరి, తలుపుల మండలాల్లో ఇరు పార్టీలకు సమానంగా సీట్లు వచ్చినప్పటికీ వైఎస్సార్‌సీపీ నేతలను పక్కకునెట్టిన టీడీపీ నేతలు అక్రమ మార్గంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవులను చేజిక్కించుకున్నారు. ఇక ఓడీ చెరువు మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. వైఎస్సార్‌సీపీకి 7, టీడీపీకి 7 స్థానాలు దక్కించుకున్నాయి. అయినప్పటికీ టీడీపీ నేతలు దౌర్జన్యంగా ఎంపీపీ సీటు కై వసం చేసుకున్నారు. వైస్ ఎంపీపీ స్థానం మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి దక్కింది. ఇక వైఎస్సార్‌సీపీ తప్పక గెలుస్తుందన్న ముదిగుబ్బలో కోరం లేదన్నసాకుంతో ఎంపీపీ ఎన్నిక వాయిదా వేశారు.
వైఎస్సార్‌సీపీ సరి‘కొత్త’ విజయం..
కొత్తచెరువులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఎన్నికల్లో పోటీపడిన టీడీపీ అభ్యర్థి, మాజీ ఎంపీపీ సాలక్క గారి వాణిని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దాల్ మిల్ మహాలక్ష్మి చిత్తుచిత్తుగా ఓడించి ఏకంగా ఎంపీపీ పీఠం దక్కించుకున్నారు. టీడీపీ అభ్యర్థి సాలక్కగారి వాణి భర్త సాలక్క గారి శ్రీనివాసులు చేసిన అరాచకాలను ప్రజలు గమనించి.. వైఎస్సార్‌సీపీ వైపు మళ్లారు. సాలక్క గారి వాణిపై విజయం సాధించిన దాల్ మిల్ మహాలక్ష్మి ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేశారు. మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. వైఎస్సార్‌సీపీ 6 చోట్ల విజయం సాధించింది. మిగతా 5 చోట్ల కూటమి నేతలు గెలిచారు.
బుక్కపట్నం.. విజయం పునరావృతం
బుక్కపట్నం మండలంలో వైఎస్సార్‌సీపీ విజయం పునరావృతమైంది. మండలంలోని 11 ఎంపీటీసీ స్థానాలకు గానూ.. వైఎస్సార్‌సీపీ 7 చోట్ల విజయం సాధించగా.. కూటమి పార్టీలు 4 స్థానాలు సొంతం చేసుకున్నాయి. వైఎస్సార్ సీపీ తరఫున విజయం సాధించిన పల్లగొర్ల నాగమణి ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేశారు. గతంలోనూ ఈ మండలంలో వైఎస్సార్‌సీపీ విజయ దుందుభి మోగించిన సంగతి తెలిసిందే. కూటమి నేతలు ఎన్ని కుయుక్తులు పన్నినా.. వైఎస్సార్‌సీపీ విజయాలను అడ్డుకోలేకపోయారు.
నల్లమాడ విజయం నల్లేరుపై నడకే..
వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి సొంత మండలం నల్లమాడలో వైఎస్సార్‌సీపీ జోరు కొనసాగించింది. మండలంలోని 12 ఎంపీటీసీ స్థానాలకు గానూ.. 8 చోట్ల వైఎస్సార్‌సీపీ జయకేతనం ఎగురవేసింది. వైఎస్సార్‌సీపీ తరఫున ఎంపీటీసీ సభ్యురాలిగా విజయం సాధించిన శ్రీశైలం నవ్యశ్రీ ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కూటమి నాయకులు ఎన్ని కుట్రలు చేసినా ఎంపీపీ పీఠం దక్కించుకోలేకపోయారు.
అక్కడ అధికార దర్పంతో..
ఓడీ చెరువు, కదిరి, తలుపుల మండలాల్లో కూటమి పార్టీలతో సమానంగా వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ స్థానాలు సాధించింది. అయితే కదిరి, తలుపుల మండలాల ఎంపీపీ పీఠాలను టీడీపీ అధికార దర్పంతో సొంతం చేసుకుంది. కాగా ఓడీ చెరువులో వైస్ ఎంపీపీ పదవి వైఎస్సార్‌సీపీని వరించింది. ఇక గురువారం మధ్యాహ్నం 2 గంటల వరకు సభ్యులు సమావేశానికి హాజరుకాకపోవడంతో ముదిగుబ్బ మండలంలో ఎంపీపీ ఎన్నిక ప్రక్రియను అధికారులు శుక్రవారానికి వాయిదా వేశారు.
ప్రజాదరణ కోల్పోయినా.. కూటమి నేతల తీరు మారలేదు. ఎలాగైనా అధికారం దక్కించుకోవాలన్న లక్ష్యంతో దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలతో ఎంపీపీ పీఠాలు దక్కించుకున్నారు. అధికారం అండతో ప్రజాస్వామ్యాన్ని గేలిచేశారు.
ఎంపీపీ ఎన్నికలోనూ ‘పచ్చ’ దౌర్జన్యమే
అధికార దర్పంతోనే కుర్చీలు సొంతం
నామినేషన్ల నుంచి ప్రజాస్వామ్యం ఖూనీ


