పుట్టపర్తి: పరిషత్ ఎన్నికల్లో దక్కిన అపూర్వ విజయాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి అంకితం ఇస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి తెలిపారు. కూటమి నాయకులు దౌర్జన్యాలు, దుర్మార్గాలకు పాల్పడినా అన్నింటినీ ఎదుర్కొని పుట్టపర్తి నియోజక వర్గంలో మూడు ఎంపీపీ స్థానాలు, నాలుగు వైస్ ఎంపీపీ స్థానాలు, మూడు జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకున్న నేపథ్యంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికార పార్టీ దుర్మార్గాలను ఎదుర్కొని ప్రజల ఆశీస్సులతో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు ఘన విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు. అందువల్లే మూడు ఎంపీపీ స్థానాలు, నాలుగు వైస్ ఎంపీపీ స్థానాలు దక్కాయన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు వల్లే ప్రజలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు మద్దతు పలికారన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించిన చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పారన్నారు. ఇదే స్ఫూర్తితో 2029 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండా రెపరెపలాడిస్తామన్నారు. మరోసారి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సీఎం కావడం ఖాయమన్నారు. ఇంత పెద్ద విజయం అందించిన ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉన్నామన్నారు. ఇదే ఊపుతో సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఎంపీపీ ఎన్నికలు
బాయ్‌కాట్ చేశాం
● వైఎస్సార్ సీపీ కదిరి సమన్వయకర్త మక్బూల్
● అప్రజాస్వామిక ఎన్నికను
హైకోర్టులో సవాల్ చేస్తామని వెల్లడి
కదిరి అర్బన్: తలుపుల, కదిరి మండలాల ఎంపీపీ ఎన్నికలను వైఎస్సార్‌సీపీ బాయ్‌కాట్ చేసినట్లు ఆ పార్టీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ తెలిపారు. గురువారం ఆయన తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. పోలీస్ వ్యవస్థ, ఎన్నికల అధికారులు మొత్తం ఏకపక్షంగా టీడీపీ నేతలకు సహకారం అందించారన్నారు. తలుపుల మండలంలో ఎంపీపీ ఎన్నికలో ఆరుగురు కూటమి ఎంపీటీసీలు పాల్గొనాల్సి ఉండగా, గురువారం జరిగిన సమావేశంలో ఐదుగురే పాల్గొన్నారని, ఎంపీటీసీ బుర్ర లక్ష్మీదేవమ్మ ఎన్నికకు దూరంగా ఉన్నారన్నారు. అయితే టీడీపీ నేతలు మాత్రం బుర్ర లక్ష్మీదేవమ్మ ఎన్నిక ప్రక్రియలో పాల్గొన్నట్లు రికార్డుల్లో నమోదు చేయించి ఎంపీపీ పదవిని అక్రమమార్గంలో కై వసం చేసుకున్నారని మక్బూల్ ఆరోపించారు. తమ బాగోతం బయటకు రాకుండా మీడియాను సైతం దూరంగా ఉంచారని, సీసీటీవీ, వీడియోగ్రఫీ లేకుండా తతంగం నడిపారన్నారు. అప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిన ఎన్నికను తాము కోర్టులో సవాల్ చేయనున్నట్లు వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులను చట్టం ముందు నిలబెడతామన్నారు.
కదిరి రూరల్‌లోనూ అంతే...
కదిరి రూరల్ మండలంలోని 10 ఎంపీటీసీ స్థానాల్లో తాము ఐదు, కూటమి ఐదు స్థానాల్లో విజేతలుగా నిలిచినట్లు మక్బూల్ తెలిపారు. అయితే వైఎస్సార్ సీపీ గుర్తుపై గెలిచిన ముత్యాలచెరువు ఎంపీటీసీ రాఘవేంద్రను ప్రలోభపెట్టి ఎన్నికకు హాజరుకాకుండా టీడీపీ నాయకులు కుట్ర చేశారన్నారు. రాఘవేంద్రపై పార్టీ క్రమశిక్షణ చర్యలు కచ్చితంగా ఉంటాయన్నారు.
మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి


