● ఎంపీపీ ఎన్నికలో పొత్తు ధర్మానికి తూట్లు
● బీజేపీ ఎంపీటీసీని కాదని సొంతపార్టీ వారికే మద్దతు
తాడిమర్రి: తమకు అవసరమైన సమయంలో పొత్తుధర్మం అంటూ కూటమిలోని బీజేపీని కౌగలించుకునే పచ్చ నేతలు...అవసరం తీరాక వెన్నుపోటు పొడుస్తున్నారు. తాడిమర్రి ఎంపీపీ ఎన్నికల్లో మరోసారి బహిర్గతమైంది. తాడిమర్రి మండలంలో 9 ఎంపీటీసీ స్థానాలుండగా ఈనెల 5వ తేదీన జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో 3 స్థానాలను వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. మరో 5 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. పెద్దకోట్ల ఎంపీటీపీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ఆర్వేటి నాగరత్నమ్మ గెలుపొందారు. గురువారం అధికారులు ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. తొలుత ఎంపీటీసీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. పొత్తులో భాగంగా తాడిమర్రి ఎంపీపీ స్థానం బీజేపీకి కేటాయించగా...ఆర్వేటి నాగరత్నమ్మ పోటీలో నిలిచారు. కూటమి ధర్మానికి కట్టుబడి టీడీపీ ఎంపీటీసీలు ఆమెకు మద్దతు ఇవ్వాలి. కానీ అందుకు విరుద్ధంగా వారంతా టీడీపీకే చెందిన పిన్నదరి ఎంపీటీసీ సభ్యురాలు కె.నాగవేణికి ఓటు వేశారు. దీంతో అధికారులు నాగవేణిని ఎంపీపీగా ప్రకటించారు. అనంతరం కునుకుంట్ల ఎంపీటీసీ గవిరెడ్డి పద్మావతి వైస్ ఎంపీపీగా ఎన్నుకున్నారు. అయితే పొత్తు ధర్మాన్ని విస్మరించి ఇంత మోసం చేస్తారా అంటూ ఆర్వేటి నాగరత్నమ్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.


