మాటిచ్చి మోసం చేశారు | - | Sakshi
Sakshi News home page

మాటిచ్చి మోసం చేశారు

Nov 20 2026 2:36 AM | Updated on Nov 20 2026 2:36 AM

తనకల్లు: తనను ఎంపీపీని చేస్తామని చెప్పి మాట ఇచ్చిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ మోసం చేశారని కొర్తికోట టీడీపీ ఎంపీటీసీ సభ్యురాలు సుమియా బేగం కన్నీటి పర్యంతమయ్యారు. గురువారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో జరిగిన ఎంపీపీ ఎన్నికలో మరొకరిని ఎన్నుకోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నమ్మకద్రోహాన్ని నిరసిస్తూ మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు.

ఏళ్లుగా కష్టపడ్డాం..

రూ.కోట్లు ఖర్చు చేశాం

తన తండ్రి మస్తాన్‌వలి 20 ఏళ్లుగా టీడీపీ కోసం కష్టపడ్డాడని, రూ. కోట్లు ఖర్చు చేసినా తనకు అన్యాయం చేశారని సుమియా బేగం ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ నాయకుడు శంకర్‌నాయుడు తన భార్యను గేమేనాయక్‌తండా ఎంపీటీసీగా నిలబెట్టారని, అయితే ఆమె ఓడిపోవడంతో..శంకర్‌నాయుడు తనపై కక్షగట్టి ఎంపీపీ పదవి రాకుండా అడ్డుకున్నారన్నారు. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ వచ్చి తమకు సమాధానం చెప్పాలని కార్యాలయం గేటు ముందు తన సోదరితో కలిసి భైఠాయించారు. శంకర్‌నాయుడు అనధికారికంగా ఎంపీపీ ఎన్నికలో పాల్గొనడానికి అధికారులను ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నించారు. దీంతో పోలీసులు శంకర్‌నాయుడు అక్కడి నుండి పంపించి వేశారు. ఎంపీపీ ఎన్నిక సందర్భంగా మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.

వైస్‌ ఎంపీపీ ఇస్తామని వంచించారు

తనను వైస్‌ ఎంపీపీని చేస్తామని చెప్పి వంచించారని తనకల్లు–2 టీడీపీ ఎంపీటీసీ సభ్యురాలు లక్ష్మీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం జరిగిన ఎన్నికల్లో వైస్‌ ఎంపీపీగా మరోవ్యక్తిని ఎన్నుకోవడంతో లక్ష్మీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుటుంబం ఏళ్లుగా టీడీపీ కోసం పనిచేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. తనను నమ్మి ఓటు వేసిన ప్రజలకు న్యాయం చేయనప్పుడు తనకు ఎంపీటీసీ పదవి అవసరం లేదన్నారు. ఎంపీటీసీ పదవికి రాజీనామా చేస్తానని, ఆమోదించాలంటూ తన భర్త రవీంద్రానాయక్‌తో కలిసి ఎంపీడీఓ రామానాయక్‌ను కోరారు. ఎంపీటీసీ రాజీనామాను ఆమోదించే అధికారం తనకు లేదని, జెడ్పీ సీఈఓను కలవాలని ఎంపీడీఓ చెప్పడంతో రేపోమాపో జెడ్పీ సీఈఓను కలిసి ఎంపీటీసీ పదవికి రాజీనామా చేస్తానని ఆమె విలేకరులకు తెలిపారు.

ఎమ్మెల్యే కందికుంటపై

టీడీపీ ఎంపీటీసీ

సుమియాబేగం ఆగ్రహం

ఎంపీపీగా అవకాశమిస్తామని అన్యాయం చేశారని ఆవేదన

మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement