పుట్టపర్తి అర్బన్: బుక్కపట్నం, కొత్తచెరువు పుట్టపర్తి మధ్యలో ఉన్న బుక్కపట్నం చెరువు(విరూపన్న చెరువు)ను నిపుణుల బృందం బుధవారం పరిశీలించింది. ఈసందర్భంగా నిపుణుల బృందం సభ్యులు మక్బూల్ సాహెబ్, రమేష్, శుభకుమార్, ఇరిగేషన్ ఈఈ ఉమామహేశ్వరరావు, ఏఈఈ జాకీర్, జమునాబాయి తదితరులు చెరువు తూములు, ఛానళ్లతోపాటు చెరువుకట్ట పటిష్టతను తనిఖీ చేశారు. చెరువు ఆయకట్టు సంఘం ప్రెసిడెంట్ నవీన్‌కుమార్, కిష్ణప్ప చెరువు విస్తీర్ణం, ఆయకట్టు వివరాలను తెలియజేశారు. చెరువులో పూడికతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిందని, ఆయకట్టు భూములు నీటితో మునుగుతున్నట్లు చెప్పారు.
రైలు ఢీ కొని వృద్ధుడి దుర్మరణం
పెనుకొండ రూరల్(సోమందేపల్లి): రైలు ఢీ కొనడంతో వృద్ధుడు మృతి చెందిన సంఘటన, బ్రాహ్మణపల్లి సమీపంలో చోటు చేసుకొంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు. బ్రాహ్మణపల్లికి చెందిన కురుబ ఆదెప్ప(70) బుధవారం మేకల మేపు కోసం రైల్వే ట్రాక్ సమీపంలోకి వెళ్లాడు. ఈక్రమంలో రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనలో ఒక మేకపోతు కూడా మృత్యువాత పడింది. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు రైల్వే కానిస్టేబుల్ సురేష్ తెలిపారు.
రైలు నుంచి జారిపడి
వ్యక్తి మృతి
పెనుకొండ రూరల్: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన పెనుకొండ రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు..బెంగళూరులోని ఎలచ్చనహళ్లికి చెందిన సురేష్ బహదూర్(53) బుధవారం తెల్లవారుజామున రైలులో అనంతపురం వైపు నుంచి బెంగళూరు బయలుదేరాడు. పెనుకొండ రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే రైలు తలుపు వద్ద ఉన్న అతడు ప్రమాదవశాత్తూ జారి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు రైల్వే కానిస్టేబుల్ పవన్ తెలిపారు.
అనారోగ్యంతో యువకుడి ఆత్మహత్య
లేపాక్షి: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువకుడు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తండ్రి నరసింహప్ప తెలిపిన వివరాలు..నాయనిపల్లికి చెందిన ప్రశాంత్(30) కొంతకాలం క్రితం కాలుకు తీవ్రగాయమైంది. అది పుండుగా మారి రక్తస్రావం జరుగుతుండేది. ఈక్రమంలో నొప్పులు భరించలేక మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం రాత్రి నొప్పులు తీవ్రం కావడంతో భరించలేక నాయినిపల్లి–కల్లూరు మధ్యన ఉన్న సాధువమ్మ తోట వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం ప్రశాంత్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించగా చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడికి భార్య భారతి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
చికిత్స పొందుతూ
వ్యక్తి మృతి
బత్తలపల్లి: అనంతపురం–కదిరి జాతీయ రహదారిపై రామాంజులపల్లి క్రాస్ సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బత్తలపల్లి పోలీసులు తెలిపిన వివరాలు.. సూర్యచంద్రాపురం గ్రామానికి చెందిన సాకే కుళ్లాయప్ప(36) మంగళవారం దంపెట్ల గ్రామంలో టీడీపీ వర్గీయుల నామినేషన్ కార్యక్రమానికి వెళ్లాడు. అనంతరం తిరిగి స్వగ్రామానికి బైక్‌పై బయలుదేరాడు. రామాంజులపల్లి క్రాస్ వద్ద బైక్ అదుపుతప్పి కింద పడ్డాడు. ఘటనలో తీవ్రంగా గాయడిపన అతడిని అనంతపురం తరలించారు. చికిత్స ఫలించకపోవడంతో బుధవారం అక్కడే మృతి చెందాడు. కుళ్లాయప్పకు భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య సాకే గంగాభవాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


