అదను చూసి తల్లిని మట్టుబెట్టాడు | - | Sakshi
Sakshi News home page

అదను చూసి తల్లిని మట్టుబెట్టాడు

Nov 20 2026 2:18 AM | Updated on Nov 20 2026 2:18 AM

● వృద్ధురాలి హత్య కేసులో కుమారుడి అరెస్ట్‌

గుంతకల్లు: అన్న మరణంతో వచ్చే ఇన్సూరెన్స్‌ డబ్బుతోపాటు తల్లిపేరుపై ఉన్న ఇంటిని దక్కించుకోవాలనే ఆశతో అదను చూసి కన్నతల్లినే మట్టుబెట్టాడు ఆ కుమారుడు. తల్లి హత్య కేసులో కుమారుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. బుధవారం రూరల్‌ పోలీసుస్టేషన్‌ డీఎస్పీ బీ శ్రీనివాస్‌రావు రూరల్‌ సీఐ రామారావుతో కలిసి వివరాలు వెల్లడించారు. పట్టణంలోని వాల్మీకి సర్కిల్‌ దోనిముక్కలరోడ్డులో నివాసముంటున్న ఆకుతోట సుంకలమ్మకు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఇటీవల సుంకలమ్మ పెద్ద కుమారుడు నగేష్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈక్రమంలో నగేష్‌ ఇన్సూరెన్స్‌ చేసి ఉండటంతో బీమా సొమ్ము రావాల్సి ఉంది. దీంతో చిన్నకుమారుడు ఆదెప్ప అన్న బీమా సొమ్ముతోపాటు తల్లిపేరుపై ఉన్న ఇంటిని తన పేరున రాయాలని వేధించేవాడు. గత సోమవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో తల్లిని గొంతుకు తాడుతో బిగించి హత్య చేసి అక్కడ నుంచి పరారయ్యాడు. సుంకలమ్మ కుమార్తె చెన్నమ్మ ఫిర్యాదు మేరకు రూరల్‌ సీఐ రామారావు, ఎస్‌ఐ కే.బాలముని సిబ్బందితో కలిసి దర్యాప్తు చేపట్టారు. బుధవారం మధ్యాహ్నం పట్టణంలోని హనుమన్‌ సర్కిల్‌లోని పెట్రోల్‌ బంక్‌ సమీపంలో నిందితుడు ఆదెప్పను అరెస్టు చేసినట్లు డీఎస్పీ చెప్పారు. గుంతకల్లు జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించారన్నారు.

నాటుబాంబు పేలి ఎనుము మృతి

కుందుర్పి: మండలంలోని కరిగానిపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో నాటుబాంబు పేలి ఓ ఎనుము మృతి చెందింది. వివరాలు.. గ్రామానికి చెందిన పరమేశప్ప తన ఎనుమును గ్రామ సమీపంలోని అటవీప్రాంతంలో మేత కోసం తోలుకెళ్లాడు. ఈక్రమంలో ఎనుము నాటుబాంబును నోటితో తాకడంతో పేలుడు సంభవించి తీవ్రంగా గాయపడి కొద్ది సేపటికే మృతి చెందింది. ఘటనలో రూ.70 వేలు నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు వాపోయాడు.

తరచూ ప్రమాదాలు..

కర్ణాటకలోని చెళ్లకెర, కళ్యాణదుర్గానికి చెందిన కొందరు వేటగాళ్లు, ఎనుములదొడ్డి, ఎనుములదొడ్డి అటవీప్రాంతాల పరిసర ప్రాంతాల్లో అడవి పందులను చంపేందుకు నాటుబాంబులు అమర్చడంతో తరచూ ప్రమాదాలు జరుతున్నట్లు ఆయా గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కెంచంపల్లికి చెందిన పాపన్న అనే రైతు తన పొలంలో పడిఉన్న బాంబును చేత్తో పట్టుకున్నాడు. దీంతో పేలి కంటి చూపు కోల్పోయినట్లు బాధితులు వాపోయాడు. అటవీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వేటగాళ్ల ఆగడాలు ఎక్కువయ్యాయని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement