కనగానపల్లి: పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలనలో అధికారులు టీడీపీ నాయకులతో కుమ్మకై న పక్షపాతం ప్రదర్శించారు. రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి, చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి మండలాల్లో బుధవారం నామినేషన్ల పరిశీలన కార్యక్రమం జరిగింది. ఇందులో కనగానపల్లి, రామగిరి మండలాల్లో పలు గ్రామాల్లో సర్పంచ్, వార్డు మెంబర్ల స్థానాలకు పోటీ చేస్తున్న వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల నామినేషన్లను తిరస్కరించారు.
ఇద్దరు సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ
రామగిరి, కనగానపల్లి మండలాల్లో సర్పంచ్ స్థానాలకు పోటీ చేస్తున్న ఇద్దరు వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. ఇందులో రామగిరి మండలం నసనకోట పంచాయతీకి పోలీసుల భద్రత మధ్య నామినేషన్ వేసిన కాంతప్ప నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశాలు, స్థానిక టీడీపీ ఒత్తిడితో అధికారులు నామినేషన్ పత్రంలో సంతకాలు లేవనే సాకుతో ఉద్దేశపూర్వకంగా తిరస్కరించారని వైఎస్సార్‌సీపీ మండల నాయకులు ఆరోపించారు. దీంతో పాటు వార్డు మెంబర్ల స్థానాలకు వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు ఎవ్వరూ పోటీ చేయకపోవటంతో నసనకోట పంచాయతీకి ఎన్నిక లేకుండా అధికార పార్టీ అడ్డదారుల్లో ఏకగీవ్రం చేసుకున్నట్లు వారు తెలిపారు. ఇక కనగానపల్లి మండలం ముక్తాపురం గ్రామ పంచాయతీని కూడా అధికార టీడీపీ నాయకులు ఏకగ్రీవం చేసుకున్నారు. వైఎస్సార్‌సీపీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన వెంకటలక్ష్మి నామినేషన్‌లో ఓటరు తప్పుగా ఉందని చూపి తిరస్కరించారు. ఇక్కడ కూడా వార్డు మెంబర్ల స్థానాలను ఇతరులు పోటీ చేయకపోవటంతో ముక్తాపురం గ్రామ పంచాయతీని అధికార టీడీపీ ఏకగ్రీవం చేసుకుంది.
200పైగా వార్డు మెంబర్ల నామినేషన్లు తిరస్కరణ
కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి, రామగిరి మండలాల్లో 200 పైగా వార్డు మెంబర్ల నామినేషన్లను తిరస్కరించారు. వీటిలో ఎక్కువగా వైఎస్సార్‌సీపీ మద్దతుదారులవే కావడం గమనార్హం. కనగానపల్లి మండలం కోనాపురం, భానుకోట, దాదులూరు పంచాయతీలోనే వైఎస్సార్‌సీపీ మద్దతుతో నామినేషన్లను వేసిన 12 మంది వార్డు మెంబర్ల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఇక రామగిరి, చెన్నేకొత్తపల్లి మండలాల్లో కూడా పలుచోట్ల వార్డు మెంబర్లుగా నామినేషన్లన్లు వేసిన వైఎస్సార్‌సీపీ మద్దతుదారులవి టీడీపీ నాయకుల ఒత్తిడితో అధికారులు తిరస్కరించారు
టీడీపీ నేతల ఒత్తిడితో వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల నామినేషన్ల తిరస్కరణ


