ఒక్క ఓటుతో విజయం | - | Sakshi
Sakshi News home page

ఒక్క ఓటుతో విజయం

Nov 4 2026 3:14 AM | Updated on Nov 4 2026 3:14 AM

● వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి విజయాన్ని

జీర్ణించుకోలేని పచ్చనేతలు

● రెండుసార్లు కౌంటింగ్‌...

మూడోసారికీ పట్టు

● నిబంధనలు ఒప్పుకోవని

విజేతను ప్రకటించిన అధికారులు

హిందూపురం టౌన్‌: స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారం అండతో దౌర్జన్యకాండ సాగించిన కూటమి నేతలు...చివరకు ప్రజల మద్దతుతో విజయం సాధించినా...అడ్డుకునే ప్రయత్నం చేశారు. రీకౌంటింగ్‌ పేరుతో తారుమారు చేయాలనుకున్నారు. అయినా ఒక్క ఓటుతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విజయం సాధించారు.

తొలుత 10, ఆతర్వాత 6,

మూడోసారి ఒక్కఓటు

స్థానిక ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రంలో మంగళవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఆది నుంచీ ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏలు దౌర్జన్యం చేస్తూ అధికారులును గుప్పిట్లో పెట్టుకుని ఏకపక్షంగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే 12వ వార్డు నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటి చేసిన బాబా 10 ఓట్లతో విజయం సాధించారు. దీన్ని జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు రీకౌంటింగ్‌కు పట్టుబట్టారు. దీంతో అధికారులు మరోసారి లెక్కించగా 6 ఓట్లతో బాబా విజయం సాధించారు. అయినా మళ్లీ రీ కౌంటింగ్‌కు ‘పచ్చ’నేతలు డిమాండ్‌ చేశారు. మనస్థాపం చెందిన బాబా కౌంటింగ్‌ కేంద్రంపై నుంచి కిందకు దూకే ప్రయత్నం చేశాడు. పోలీసులు, అక్కడున్నవారు అతడికి నచ్చజెప్పి కిందికి తీసుకువచ్చారు. దీంతో బాబా రోదిస్తూ అక్కడే కూర్చుండిపోయాడు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు ఆర్డీఓ ఆనంద్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున సమక్షంలో మరోసారి ఓట్లు లెక్కించగా బాబా ఒక్క ఓటుతో విజయం సాధించారు. దీంతో టీడీపీ నేతలు మరోసారి లెక్కించాలని పట్టుబట్టినా అధికారులు అందుకు సమ్మతించలేదు. చివరకు గెలుపొందిన బాబాకు అధికారులు డిక్లరేషన్‌ అందజేశారు.

కౌంటింగ్‌ కేంద్రాన్ని

పరిశీలించిన ఎస్పీ

హిందూపురం టౌన్‌: పట్టణంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రాన్ని మంగళవారం ఎస్పీ సతీష్‌ కుమార్‌ సందర్శించి భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసు బందోబస్తు విధులు, భద్రతా చర్యలను సమీక్షించి, కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా సీసీ కెమెరాల దృశ్యాలను పర్యవేక్షించారు. అలాగే కౌంటింగ్‌ కేంద్రాల పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా పోలీసు అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించాలని సూచించారు. భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకూడదని సూచించారు. కౌంటింగ్‌ అనంతరం కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం నిఘా కొనసాగించాలని ఆదేశించారు. పట్టణంలో 144 సెక్షన్‌, 30 పోలీస్‌ యాక్ట్‌ అమలులో ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

సౌకర్యాల పరిశీలన

ధర్మవరం రూరల్‌: పట్టణంలోని బీఎస్‌ఆర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల పరిశీలకులు అరుణ్‌బాబు మంగళవారం పరిశీలించారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద చేపట్టిన భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల నిఘా, టేబుళ్లు అమరిక, అభ్యర్థులు, ఏజెంట్ల ప్రాంగణాలను ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని సిబ్బందికి ఆదేశించారు. కౌంటింగ్‌ ఏజెంట్లు, అధికారులు, మీడియా ప్రతినిధులకు అవసరమైన మౌలిక వసతులు తాగునీరు, సమాచార కేంద్రం వంటి సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement