● స్వల్ప తేడాతో ఓటమి చవి చూసిన
వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు
పుట్టపర్తి టౌన్/కదిరి టౌన్: నామినేషన్ల పర్వం నుంచి అధికార కూటమి నేతలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా..దౌర్జన్యం చేసిన పోరాడారు. ప్రజల ఆశీస్సులతో చివరివరకూ నిలిచారు. స్వల్పతేడాతో ఓటమి చవిచూశారు. అయినా ప్రజానీకం మాత్రం శభాష్ అంటూ వారిని మెచ్చుకుంటోంది. నైతిక విజయం మీదేనంటూ కీర్తిస్తోంది. ఇలా స్పల్ప తేడాతో ఓటమి చెందిన వారిలో పుట్టపర్తి అభ్యర్థులే ఎక్కువ మంది ఉన్నారు. పుట్టపర్తి 16 వార్డు వైఎస్సార్ సీపీ అభ్యర్థి కవిత కేవలం 3 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. అలాగే 17 వార్డు నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసిన సాయిలీల కూడా 17 ఓట్లతో సీటు కోల్పోయారు. ఇక 20 వార్డు నుంచి పోటీ చేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సావిత్రి 19 ఓట్లు, 24 వార్డు నుంచి పోటీ చేసిన వెంకటేష్ 22 స్వల్ప ఓట్లతో ఓటమి చెందారు. వీరి పోరాటస్ఫూర్తిని ప్రజలే మెచ్చుకుంటున్నారు. శభాష్ అంటూ భుజం తట్టారు.
● కదిరి 18వ వార్డుకు చెందిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సుమీయా 52 ఓట్లతో, 38వ వార్డుకు చెందిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దాదాపీర్ 21 ఓట్లతో పరాజయం చెందారు. అధికార పార్టీ ఆగడాలను అడ్డుకుని ప్రజా ఆశీస్సులతో తుదికంటూ పోరాటం చేసిన వారిని జనం మెచ్చుకుంటున్నారు.
డిస్ట్రిబ్యూషన్ కేంద్రం పరిశీలన
పుట్టపర్తి అర్బన్: పరిషత్ ఎన్నికల్లో భాగంగా ఈనెల 5న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనుండగా అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో పుట్టపర్తి ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం ఏర్పాటు చేశారు. మంగళవారం జేసీ మౌర్య భరద్వాజ్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. బ్యాలెట్ పెట్టెలు, బ్యాలెట్ పేపర్లు, ఇంక్, ఇతర సామగ్రి పంపిణీ వేగవంతం చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లే సిబ్బందికి అవసరమైన రవాణా సదుపాయం, భోజనాలు, తాగునీరు, వైద్య సదుపాయం అందుబాటులో ఉంచాలన్నారు. జేసీ వెంట ఆర్‌ఓ రమేష్‌బాబు, ఎంపీటీఓ నరేష్ కృష్ణ సిబ్బంది ఉన్నారు.
‘ముసురు’కున్న మేఘం
● జిల్లాలోని 15 మండలాల్లో తుంపర
పుట్టపర్తి అర్బన్: ముసురు తుపాను ప్రభావంతో జిల్లాలో 15 మండలాల్లో తుంపర వర్షం కురవగా తక్కిన మండలాల్లో ఆకాశం మేఘావృతమైంది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకూ జిల్లాలోని 15 మండలాల్లో వర్షం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా కదిరి మండలంలో 22.4 మి.మీ వర్షపాతం నమోదైంది. ఎన్‌పీకుంట మండలంలో 20.6, నల్లచెరువు 10.6, అగళి 8.6, మడకశిర 7.4, తనకల్లు 5.6, గాండ్లపెంట 4.8, ముదిగుబ్బ 3.2, సీకేపల్లి 2.4, కనగానపల్లి 2.2, ధర్మవరం, తాడిమర్రి, పెనుకొండ, ఓడీచెరువు మండలాల్లో 1.2 మి.మీ చొప్పున వర్షం కురిసినట్లు అధికారులు వెల్లడించారు. ముసురు ప్రభావంతో మరో రెండు రోజులూ జిల్లాకు వర్ష సూచన ఉన్నట్లు తెలిపారు.
ఉమ్మడి జిల్లాకు వర్ష సూచన
అనంతపురం అగ్రికల్చర్: ఉమ్మడి అనంతపురం జిల్లాకు రాగల మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.


